ప్రగతి చక్రంపై…ప్రయి’వేటు’!

On the wheel of progress...Private'!ప్రభుత్వ శాఖగా నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌-ఆర్టీడీ) 1932లో 27 బస్సులు, 116 మంది ఉద్యోగులతో ప్రారంభమైంది. నేటికి దాదాపు 92 ఏండ్లవుతోంది. ప్రస్తుతం అది ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేషన్‌ ద్వారా నడుపబడుతున్నది. కోట్లాదిమంది ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చి ఆర్టీసీ కుటుంబాలకు బాగా చేరువైంది. మొదట పట్టణాలు, ఆ తర్వాత గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి జనజీవనంలో మార్పులొచ్చిన మాట వాస్తవం. అందుకే ‘బస్సు చక్రం.. ప్రగతి రథచక్రం’ అన్నారు. అలాంటి ప్రగతిచక్రంపై ఇప్పుడు ప్రయివేటు దాడి చేస్తున్నది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఒప్పందాల్ని కూడా చేసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగంగా ఉన్న ఆర్టీసీ కాస్తా ‘ఈ-బస్సుల’ పేరుతో ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల పరమవుతున్నది.
1958 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఆర్టీసీగా 22,628 బస్సులతో ఏర్పడింది. ఒక దశలో ఒక లక్ష 20వేల మంది పర్మినెంట్‌ ఉద్యోగులు కలిగిన సంస్థ ఏపీఎస్‌ఆర్టీసీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 59 వేల ఉద్యోగులు కలిగిన సంస్థ 2024 ఏడాదిలో 42 వేలకు పడిపోయింది. ప్రస్తుతం 9094 బస్సులు కలిగి ఉన్న టీజీఎస్‌ఆర్టీసీలో 6368 సొంత బస్సులు కాగా, 2726 అద్దె బస్సులు. జెడ్‌ సిరీస్‌ నెంబర్‌ ప్లేట్‌ కలిగినవి సొంత బస్సులు కాగా మిగతా సిరీస్‌ కలిగినవి అద్దె బస్సులు. అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రయివేటు వారు కాగా కండక్టర్లు ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ పర్మినెంట్‌ డ్రైవర్ల సగటు నెల వేతనం రూ.45వేలు ఉండగా ప్రయివేటు అద్దె బస్సు డ్రైవర్ల సగటు నెల జీతం రూ.15వేలు మాత్రమే. ఎలక్ట్రికల్‌ బస్సుల్లో కండక్టర్లు లేనేలేరు. ఎలక్ట్రికల్‌ బస్సుల్లో టిక్కెట్లను టికెట్‌ ఇష్యూయింగ్‌ మిషిన్స్‌ (టీమ్స్‌) ద్వారా డ్రైవర్లే ఇవ్వాలి. గతంలో నాన్‌స్టాప్‌ బస్సుల్లో మాత్రమే డ్రైవర్లు టిమ్స్‌ ద్వారా టిక్కెట్లు ఇచ్చేవారు. ఇప్పుడు మల్టీస్టాపులు గల బస్సుల్లో కూడా టిమ్స్‌ ద్వారా టిక్కెట్లను డ్రైవర్లు ఇస్తున్నారు. ఒక చేత్తో డ్రైవింగ్‌ చేస్తూనే మరో చేత్తో టికెట్లు ఇవ్వడంతో డ్రైవింగ్‌పై ఏకాగ్రత కోల్పోయి బస్సులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఏర్పడు తున్నాయి.
గ్రాస్‌ కాస్ట్‌ కాంటాక్ట్‌ (జిసిసి) పద్ధతి ద్వారా హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, రీజియన్‌లలో 75 ‘ఈ-బస్సులు’ అక్టోబర్‌ 2024 నుండి రన్‌ అవుతున్నాయి. మొదటిసారిగా 2018లో నలభై ఏసీ ఎలక్ట్రికల్‌ బస్సులను హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుండి ఎయిర్‌పోర్టుకు ప్రవేశపెట్టింది. త్వరలోనే వెయ్యిబస్సులు, రాబోయే రెండేండ్లలో మూడువేల ఎలక్ట్రికల్‌ బస్సులు ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ‘జై భారత్‌ మారుతి (జేబిఎం) ద్వారా కరీంనగర్‌, హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ డిపోల్లో ఈ-బస్సు సర్వీసులు నడిపిస్తున్నారు. 41 సీట్లు గల ఎలక్ట్రికల్‌ బస్సు ధర సుమారు కోటిన్నర రూపాయలు. ఎలక్ట్రికల్‌ బస్సు జీవితకాలం 12 నుండి 15ఏండ్లకు లేదా 15 లక్షల కిలోమీటర్లు. జేబీఎం కంపెనీకి ఆర్టీసీ కిలోమీటర్‌ కు రూ.39 చెల్లిస్తున్నది. ప్రస్తుత ఒప్పంద ప్రకారం బస్సు జీవి తకాలంలో జేబీఎం కంపెనీకి ఆర్టీసీ చెల్లించేది అక్షరాల రూ.5 కోట్ల 85 లక్షలు అన్నమాట. ఇందులో విద్యుత్తు చార్జింగ్‌ ఖర్చు కిలో మీటర్‌కు ఏడు రూపాయలు. కాగా, మెయింటనెన్స్‌తో పాటు సిబ్బంది ఖర్చు సుమారు రూ.4 మాత్రమే. ప్రజలకు టిక్కెట్ల ధర తగ్గించకుండా, డ్రైవర్లను, కండక్టర్లను సిబ్బందిని పర్మినెంట్‌గా నియమించకుండా, కార్పోరేట్‌ సంస్థలకు లాభాలు సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నది.
ఆర్టీసీ ఎలక్ట్రికల్‌ బస్సులో డ్రైవర్‌ నౌకరి సంబురం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్‌ బస్సుల్లో డ్రైవర్లు అసమానజీతాలిస్తూ.. నియామక ఒప్పందాలు తుంగలో తొక్కుతూ ప్రయివేటు ఏజెన్సీలు దోపిడీకి గురిచేస్తున్నాయి. జేబీఎం సంస్థ ‘చక్ర ఈ ట్రాన్స్‌’, ‘హంస’ తదితర ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించి ఈ-బస్సుల డ్రైవర్లను నియమించారు. అవి ఓవర్‌ టైంకు అదనంగా ఒక్కరూపాయి ఇవ్వకుండా శ్రమను దోచుకుం టున్నాయి. పైగా అక్టోబర్‌ వేతనాల్లో సగమే ఇచ్చి… మిగిలిన నెలల వేతనాల్లో కోతలు విధిస్తూ ఇన్‌స్టాల్మెంట్‌ పద్ధతుల్లో అరకొరగా చెల్లిస్తున్నాయి. డ్రైవర్లకు ఒక్కొక్క డిపోలో ఒక్కోతీరు వేతనాలు, పనిగంటలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాల్లో అసమానతలు ఉద్యోగంలో చేరిన నాటినుంచే మొదలయ్యాయి. కరీంనగర్‌లో ఈ బస్సుల డ్రైవర్లకు 26 రోజులు పనిచేస్తే పీఎఫ్‌ కటింగ్‌ మినహాయించి రూ.19,200 ఇస్తామని ‘చక్ర ఈ ట్రాన్స్‌’ ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. అది ఆచరణలో అమలు చేయడం లేదు. డ్రైవర్లకు ఐడీ నెంబర్లు ఇష్యూ చేసి ఆ ఐడీల మీదనే బస్సులు, టిక్కెట్‌ మిషన్లు ఇచ్చి విధుల్లోకి తీసుకుంది. అయితే జీతాల చెల్లింపులో మాత్రం కోతలు విధిస్తూ అర్ధంకాని విధంగా వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతోంది. ఇందులో కరీంనగర్‌-2 డిపోకు 41 బస్సులు అప్పగించిన జేబీఎం సంస్థ డ్రైవర్లను అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆగస్టులో శిక్షణ ఇచ్చి 50శాతం జీతం ఇస్తామని చెప్పి మోసం చేసింది. సెప్టెంబర్‌లో ఏడురోజుల జీతాన్ని పెండింగ్‌లో పెట్టింది. అక్టోబర్‌ జీతాలు అందరికీ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే రూ.5వేలు, రూ.8వేలు, రూ.10వేలు ఇన్‌స్టాల్‌మెంట్‌ రూపంలో జీతాలి చ్చింది.
ఈ జీతాల్లోనూ అనేక వ్యత్యాసాలున్నాయి. ఇరవై ఎనిమిది డ్యూటీలు చేసిన కార్మికుడికి రూ.15,524, అదే ఇరవై ఎనిమిది డ్యూటీలు చేసిన మరో కార్మికుడికి రూ13,400, ఇరవై ఆరు డ్యూటీలు చేసిన ఇంకో కార్మికునికి రూ.14,242, ఇరవై ఒక్క డ్యూటీలు చేసిన మరో కార్మికునికి రూ.12,436 జీతం ఇచ్చారు. ఇది ఏ లెక్కన ఇచ్చారో సమాధానం చెప్పకుండా అటు ఏజెన్సీ నిర్వాహకులు, ఇటు ఆర్టీసీ అధి కారులు దాటవేస్తూ వచ్చారు. టిక్కెట్‌ ఇష్యూ మిషన్లు (టిమ్స్‌)ల ద్వారా ఆర్టీసీ నుండి డ్రైవర్లకు టిక్కెట్‌కి రూ.2చొప్పున, వాటర్‌ బాటిల్స్‌ అమ్మకంపై ఒక్కో బాటిల్‌కు 50 పైసలు కమీషన్‌ ఇవ్వాలి. ఈ కమీషన్‌ కూడా ఆర్టీసీ అధికారులు ఇవ్వలేదు. ఒప్పందం ప్రకారం ఏజెన్సీలు జీతాలివ్వడం లేదు. పీఎఫ్‌, ఈ ఎస్‌ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు అతీగతీ లేదు. ఓటీ సౌకర్యం కూడా లేదు. డ్యూటీకి ఎక్కిన తర్వాత ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నియామకపత్రాలు, పేస్లిప్లు తదితర అంశాలు ఏమీ ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే.. సరైన సమాధానం లేకపోగా బెదిరింపులే ఎదురయ్యాయి. దీంతో కరీంనగర్‌-2 డిపోకు చెందిన ఈ- బస్సుల డ్రైవర్లంతా డిసెంబర్‌ 2న మెరుపు సమ్మెకు దిగారు. సీఐటీయూ సమ్మెకు సంఘీభావం తెలిపింది. దిగొచ్చిన ఏజెన్సీలు 3న డ్రైవర్ల డిమాండ్లు అంగీకరించాయి.
ఆర్టీసీలో గత టీ(బీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అవలంబిస్తున్నది. 2019లో జరిగిన సమ్మె అనంతరం అప్పటి పభుత్వం యూనియన్లు లేకుండా చేసింది. డిపోల వారీగా అధికారులచే నియమించిన వెల్ఫేర్‌ కమిటీల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని నమ్మబలికింది. యూనియన్ల విషయంలో అదేవిధానాన్ని కాంగ్రెస్‌ సర్కార్‌ అనుసరిస్తున్నది. పని భారం విపరీతంగా పెంచింది. 2021 ఏప్రిల్‌ నుండి రావాల్సిన పీఆర్సీ గురించి మాట్లాడటం లేదు. కనీసం స్పేర్‌ పార్ట్స్‌ కూడా ఇవ్వడం లేదు. ప్రయివేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాల్లో తేడా లేదు. ఆర్టీసీ సొంతబస్సులు, అద్దె బస్సులు, ఈ-బస్సులతో డ్రైవర్లలో విభజన రేఖలు సృష్టించింది. ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనార్థం ఏర్పడింది ఆర్టీసీ. ఆ మాటకొస్తే ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వరంగ సంస్థల రక్షణ కోసం కార్మికవర్గం పోరాడాలి. అందుకు సహకరించేవి, పోరాటాలు చేసేది వామపక్షాలు మాత్రమే.
గీట్ల ముకుందరెడ్డి
9490098857