సంక్షేమంపై ప్రయి’వేటు’!

Private 'rate' on welfare!అద్దాల మేడల నిర్మాణంలో రాళ్లెత్తే కూలీలు వారు. రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు. అడ్డాలపై నిలబడి పనికోసం పడిగాపులు పడుతుంటారు. ఎన్నో పోరాటాల ఫలితంగా కొన్ని హక్కులు, సంక్షేమ పథకాలు సాధించుకున్నారు. ఇప్పుడు ఆ పథకాల నుండి ప్రభుత్వం తప్పుకోజూస్తున్నది. ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగించి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం టెండర్లను కూడా ఆహ్వానించింది. దీంతో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వెల్ఫేర్‌ బోర్డ్‌ ఏర్పాటు చేశారు. దీని ఆధ్వర్యంలో 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులోని ప్రమాద మరణం, సహజ మరణం, పాక్షిక, శాశ్వత అంగవైకల్యానికి సంబంధించిన పథకాలను ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తామంటూ ఆగస్టు 21వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న ఈ పథకాలను ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగించడం వల్ల వచ్చే ఆ కాస్త ప్రయోజనాలు కూడా అందకుండా పోతాయేమోనని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వీరి వేదనలో నిజం లేకపోలేదు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే అనేక తప్పులు చూపి, సాకులు వెదికి కార్మికులకు రావల్సిన నష్టపరిహారం అందకుండా చేస్తున్నారు. ఇక (ప్రయివేటు) ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తే సమస్య ఎంత జఠిలమవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
ఇందులో అనేక తిరకాసులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వెల్ఫేర్‌ బోర్డులో తమ పేర్లు నమోదు చేసుకున్న కార్మికులు 25,71,880. వీరంతా ప్రతి ఐదేండ్లకు ఓసారి రెన్యువల్‌ చేయించుకోవల్సి వుంటుంది. అనేక సమస్యలతో ప్రస్తుతం 15,10,330 మంది మాత్రమే రెన్యువల్‌ చేయించుకున్నారు. ప్రభుత్వం వీరిని మాత్రమే కార్మికులుగా గుర్తిస్తోంది. మిగిలిన వారిని ఈ స్కీమ్‌ పరిధిలో చూపించడం లేదు. మరో విషయం గిగ్‌ వర్కర్స్‌(ఆన్‌లైన్‌ కార్మికులు)ను కూడా ఇందులో కలుపుతామంటున్నారు. అయితే వీళ్లకు ప్రీమియం ఎవరు కడతారనే దాంట్లో స్పష్టత లేదు.
నిబంధనల ప్రకారం పది లక్షల రూపాయలకు మించి కట్టే ప్రతి భవనానికి ఆ యజమాని పర్మిషన్ల సమ యంలో ప్రభుత్వానికి ఒక శాతం చెల్లించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలా రూ.5,700 కోట్లు బోర్డులో జమయ్యాయి. ఇందులో రూ.4,262 కోట్లు మాత్రమే కార్మికుల సంక్షేమానికి అందాయి. మిగిలిన మొత్తం గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు ఖర్చు చేసుకున్నారు. చట్టం ప్రకారం ఒక శాఖకు చెందిన నిధులను మరో శాఖకు మళ్లించే హక్కు ప్రభుత్వానికే లేదు. అయినా న్యాయంగా కార్మికులకు అందాల్సిన నిధులను అధికారులు దారి మళ్లించారు. వాస్తవానికి 1996 చట్టం ప్రకారం వెల్ఫేర్‌ బోర్డుకు కార్మిక సంఘ నాయకులతో ఓ అడ్వయిజరీ కమిటీ నియమించాలి. నిధులు ఖర్చు పెట్టాలన్నా, మార్పులేమైనా చేయాలన్నా ఈ కమిటీ నిర్ణయించాలి. అలాంటి కమిటీ మన రాష్ట్రంలో అసలు లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. మరో ముఖ్యమైన విషయం ఈ పదేండ్లలో రాష్ట్రంలో కేవలం 5639 మంది మరణం ద్వారా, 627 మంది అంగవైకల్యం ద్వారా ఈ పథకాల నుండి ప్రయోజనం పొందారు. కానీ ప్రీమియం మాత్రం ప్రభుత్వం ప్రతి ఏడాది అందరికీ చెల్లిస్తుంది. దాంతో పెద్ద మొత్తంలో అందులో డబ్బు జమవుతుంది. వడ్డీ కూడా బాగానే వస్తుంది. ఇదంతా ప్రస్తుతం వెల్ఫేర్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఉంది. అయితే ఐఆర్‌డీఏ పరిధిలోని ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తామని అంటున్నారు. అందులో ప్రభుత్వ కంపెనీలతో పాటు ప్రయివేటు కంపెనీలు కూడా ఉన్నాయి. ఏ కంపెనీలకు అప్పగిస్తారనేదాంట్లో స్పష్టత లేదు. ఒకవేళ ప్రయివేటు వారికి అప్పగిస్తే కార్మికుల నిధిని ఇన్సురెన్స్‌ కంపెనీలు స్వాహా చేసే ప్రమాదముంది.
ఒకపక్క అడ్డాల్లో మౌలిక సదుపాయాలు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేరళ, పంజాబ్‌, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రాలు 60 ఏండ్లు దాటిన కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఇలాంటివేవీ అమలు చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా కార్మిక సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేస్తుందనుకుంటే ముఖ్యమైన స్కీంలను హడావుడిగా ఇన్సురెన్స్‌ కంపెనీలకు అప్పగిస్తామంటున్నది. అందుకే కార్మికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి. ఎట్టిపరిస్థితుల్లో కార్మిక సంక్షేమ పథకాలను ప్రభుత్వమే అమలు చేయాలి. ఒకవేళ అప్ప గించాల్సి వస్తే ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే అప్పగించాలి. అప్పుడే కార్మికులకు మేలు జరుగుతుంది. అలాగే వెంటనే వెల్ఫేర్‌ బోర్డ్‌ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఇది సర్కారు బాధ్యత.