పది విద్యార్థులకు ‘ప్రయివేటు’ గాలం

'Private' tuition for ten students– సీటు రిజర్వ్‌ చేసుకుంటే 20నుంచి 30 శాతం రాయితీ
– విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులపై ఒత్తిడి
– టార్గెట్‌ పూర్తిచేస్తే.. అదనపు వేతనం, : ఉద్యోగం పదిలమంటూ ఆఫర్‌
– విద్యార్థుల పేరెంట్స్‌ను ఆకర్షించేందుకు కొన్ని కాలేజీల్లో పీఆర్వోల నియామకం
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘సార్‌ మీ ఇంట్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలున్నారా? ఉంటే మా కాలేజీలో చేర్పించండి. ఫలితాలు వచ్చిన తర్వాత అయితే ఫీజు ఎక్కువగా ఉంటుంది. ముందే రిజర్వు చేసుకుంటే ఫీజులో 25 నుంచి 30 శాతం రాయితీ లభిస్తుంది. ఎంసెట్‌, నీట్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం..’ పదోతరగతి పరీక్షలు రాసిన తల్లిదండ్రులకు ప్రయివేటు, కార్పొరేట్‌ ఇంటర్మీడియట్‌ కాలేజీల పీఆర్‌వోలు, అధ్యాపకులు ఇస్తున్న ఆఫర్‌ ఇది.
పదోతరగతి వార్షిక పరీక్షలు మార్చి 18 ప్రారంభమై.. ఈనెల 2న ముగిసిన విషయం తెలిసిందే. వాస్తవానికి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కాకముందు నుంచే పలు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల వేట ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్‌వోలను నియమించుకోగా, ఇంకొన్ని కాలేజీలు విద్యార్థులను చేర్పించే బాధ్యతను ఇప్పటి వరకు ఆయా కాలేజీల్లో పనిస్తున్న అధ్యాపకులకు అప్పగించాయి. విద్యార్థులను చేర్పించే విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన టార్గెట్‌ ఇచ్చినట్టు తెలిసింది. టార్గెట్‌ పూర్తి చేసిన వారికే వేతన పెంపు, కొలువు పదిలంగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాయి. ఇంటర్‌ పరీక్షలు పూర్తి అయిపోయినా అధ్యాపకులకు ఆయా కళాశాలలు సెలవులు ఇవ్వలేదు. పదో తరగతి పరీక్షలు పూర్తి చేసిన విద్యార్థుల ఇండ్లకు అధ్యాపకులు వెళ్లి వారిని ఆకర్షించే పనిలో పడ్డారు. కాలనీలు, బస్తీలు, అపార్టుమెంట్లు తిరుగుతున్నారు. గ్రేటర్‌లోని పలు జూనియర్‌ కళాశాలల్లో పనిచేసే ఉద్యోగులు, అధ్యాపకులు ఇదే పనిలో నిమగమయ్యారు. రాష్ట్రంలో గురుకుల జూనియర్‌ కళాశాలలకు ఉన్న డిమాండ్‌ రీత్యా ప్రయివేట్‌ కాలేజీల యాజమాన్యాలు ముందుగానే ఫీజు డిస్కౌంట్లు.. పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కాలేజీలు ఇవే చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల కాలేజీల యాజమాన్యాలు కూడా ఇక్కడ ప్రచారం చేయడం గమనార్హం.పెద్ద కాలేజీలు అయితే డిసెంబర్‌ నుంచీ ఇదే పనిలో ఉన్నాయి.
ఆకర్షయణీయంగా.. ఆకట్టుకునేలా..
ప్రయివేట్‌ కాలేజీలు విద్యార్థులను ఆకర్షించేందుకు తమ కాలేజీలను అందంగా.. ఆకర్షణీయంగా సిద్ధం చేస్తున్నాయి. అలాగే నగర శివారు ప్రాంతాల్లో మైదానాలు ఉన్నాయని అందులో పేర్కొంటున్నాయి. పదో తరగతి చదివే పిల్లల జాబితాలను, ఫోన్‌ నెంబర్లు సేకరించి వారి ఇండ్లకు మధ్యవర్తులను, దళారులను పంపి ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు.
చేరే వరకే డిస్కౌంట్లు.. ఆ తర్వాత అంతే
హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో పలు కళాశాలలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. ఇంటర్‌లో చేరేటప్పుడు ఫీజులో 20 శాతం నుంచి 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పదిలో మార్కుల ఆధారంగా రాయితీ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. కానీ విద్యార్థి సదరు కళాశాలలో చేరిన తర్వాత ఏడాది పూర్తి ఫీజును ఏదో ఒక రూపంలో వసూలు చేస్తారిన పలువురు అంటున్నారు. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ మెయిన్స్‌ అంటూ అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కసారి విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరాక ఏదో రూపంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. పట్టించుకునే వారు లేకుండాపోతున్నారని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.
కాలేజీల ప్రలోభాలకు తల్లిదండ్రులు గురికావొద్దు – దాసరి ఒడ్డెన్న, డీఐఈవో, హైదరాబాద్‌
విద్యార్థులు తల్లిదండ్రులు ప్రయివేట్‌ కాలేజీల మాయమాటలకు, ప్రలోభాలకు గురికావొద్దు. టెన్త్‌ పరీక్షల ఫలితాలు వచ్చాకే.. కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలి. ఫలితాలు వెల్లడి తర్వాత అనుమతులున్న కాలేజీల జాబితాను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతాం. ఏ కాలేజీలో ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయనే వివరాలు పొందుపరుస్తాం. వాటన్నింటినీ పరిశీలించిన తర్వాతే అడ్మిషన్‌ తీసుకోవాలి. కాలేజీలు చెప్పే మాటలు నమ్మి తల్లిదండ్రులు ముందే డబ్బులు కట్టి మోసపోవద్దు.
టెన్త్‌ ఫలితాలు రాకముందే కాలేజీల అడ్మిషన్‌ల దందా – కె. ఆశోక్‌ రెడ్డి, కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ, హైదరాబాద్‌
పదో తరగతి పరీక్షల ఫలితాలు రాకముందే ప్రయివేట్‌, కార్పొరేట్‌ కళాశాలల్లో అడ్మిషన్ల పేరుతో అప్పుడే దందా షురూ చేశారు. పీఆర్వోలను పెట్టి ముందే అడ్మిషన్లు తీసుకుంటే రాయితీ ఇస్తామని.. రిజల్ట్‌ వచ్చిన తర్వాత అడ్మిషన్‌ తీసుకుంటే ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి. ఇంటర్‌ బోర్డు నిబంధనల ప్రకారం టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ఫలితాలు వచ్చిన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నగరంలో కొన్ని ప్రయివేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు ఇప్పటికే 90శాతం అడ్మిషన్లు నిండిపోయాయని బోర్డు పెడుతున్నాయి. ఆ కాలేజీలపై ఇంటర్‌ బోర్డు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ధనర్జానే లక్ష్యంగా పనిచేసే కాలేజీల ఉచ్చులో తల్లిదండ్రులు పడొద్దు. ఇంటర్‌ బోర్డు అనుమతులు ఉన్నా కళాశాలల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలి.