సింగరేణి ప్రయివేటీకరణతో మణుగూరుకు ముప్పు

సింగరేణి ప్రయివేటీకరణతో మణుగూరుకు ముప్పు– పదేళ్ల కాలంలో బీజేపీ చేసింది శూన్యం
– మరో బొగ్గు గుట్టగా మారనున్న మణుగూరు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ప్రయివేటీకరణతో మణుగూరుకు పెనుముప్పు పొంచి ఉంది. భూగర్భ గనుల నుండి ఉపరితల గనులుగా మారడంతో మణుగూరు రూపురేఖలే మారిపోయాయి. పీకేఓసీ 4 ఇప్పటికే పూర్తిగా ప్రయివేటీకరణ అయింది. ఓవర్‌ బర్దన్‌, బొగ్గు వెలికితీత పూర్తిగా దుర్గ కంపెనీల అదుపులో ఉన్నాయి. దుర్గ, మహాలక్ష్మి, విపిఆర్‌, ప్రయివేట్‌ కంపెనీలే బొగ్గు ఉత్పత్తిలో పై చేయిగా పనిచేస్తున్నాయి. కాంట్రాక్ట్‌ కార్మికులచే అధిక పనిగంటలు, సౌకర్యాలు లేమితో అవస్థలు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో గడ్డుకాలంలో గడుపుతున్నారు. వేతన ఒప్పందంలో మొండి చేయి చూపుతున్నారు. హై పవర్‌ వేతనాలు అమలు చేయకుండా సింగరేణి వ్యాప్తంగా ప్రైవేట్‌ కంపెనీలు కాంట్రాక్ట్‌ కార్మికులను దోపిడీ చేస్తున్నాయి.
గత రెండు రోజులుగా వేతన ఒప్పందంలో కోసం చర్చలు జరిగాయి. స్థానిక శాసనసభ్యులు, దుర్గ, మహాలక్ష్మి, ఈపీఆర్‌ కంపెనీ యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రూ.1000 మాత్రమే పెంచుతామని యాజమాన్యం తెగేసి చెప్పింది. గతంలో రూ.1750 వేతన పెంపు, 25 మాస్టర్లు చేసినందుకు గుడ్‌ విల్‌ కింద రూ.500 చెల్లించేవారు. యాజమాన్యం దానిని రెట్టింపు చేయకుండా తగ్గించి రూ.1000 పెంచుతామని చెబుతున్నారు. దీంతో కార్మికుల మనోభావాలను దెబ్బతీశాయి. దీనిలో భాగానే శనివారం మొదటి డ్యూటీలో భాగంగా మెరుపు సమ్మె నిర్వహించారు. వేతనాల పెంచే వరకు సమ్మె నిర్వహిస్తామని కార్మికులు తెలిపారు. సమ్మె విరమించకపోతే విధులను నుండితొలగిస్తామని ప్రైవేట్‌ కంపెనీలు బెదిరిస్తున్నాయి. మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి పూర్తిగా ప్రైవేట్‌ కంపెనీల ఆధీనంలో ఉంటాయి. దీని కారణంగా మణుగూరు రూపురేఖలే మారిపోనున్నాయి. బొగ్గు గుట్టగా మారిన ఇల్లందు కన్న అద్వానంగా గడ్డు పరిస్థితులు రానున్నాయి. ఇప్పటికే భూములు కోల్పోయిన ప్రజలు కూలీలుగా మారి, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. నెల క్రితం ఓసి ఫోర్‌ విస్తరణలో భాగంగా తిర్లాపురం, రామనుజోరం గ్రామాలలో గ్రామసభలు నిర్వహించింది. ఎలాంటి నష్ట పరిహారం చెల్లిస్తుందో ఇప్పటికీ వెల్లడించలేదు. భూములను లాక్కునేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది. ఉపరితల గనుల కారణంగా మరో 10 సంవత్సరాలు కాలంలో మరికొన్ని గ్రామాలు మాయం కానున్నాయి. ఇప్పటికే రాజుపేట, విట్టల్‌ రావు నగర్‌, బాపనకుంట, శివలింగాపురం, మణుగూరు గ్రామాలలో అభివృద్ధి కుంటూ పడింది. ప్రజలకు జీవనోపాధి కరువైంది. భూముల విలువ పడిపోయింది. భూగర్భ గనుల కాలంలో విలసిల్లిన ఈ గ్రామాలు నేడు వెలవెల పోతున్నాయి. వ్యాపారాలు చితికిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి గనులను ప్రైవేటీకరించడంతో ఇప్పుడు ఆ సంస్థ అస్తిత్వానికి ముప్పు ఏర్పడింది. బొగ్గు గనుల ప్రైవేటుకరణతో సింగరేణి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మైన్స్‌ అండ్‌ మినరల్‌ డెవలప్మెంట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ 1957కు సవరణలు చేసి దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను టెండర్ల ద్వారా ప్రైవేటు పరం చేసి చర్యలు ప్రారంబి óంచారు. గనుల ప్రవేశకరణ బిల్లుకు పార్లమెంటులో ప్రతి పక్షాలు ప్రతిఘటించినా తగిన సంఖ్య బలం లేకపోవడంతో నాలుగు బొగ్గు బ్లాకులు ప్రైవేట్‌ టెండర్లుగా మారాయి. సత్తుపల్లి బ్లాక్‌-3, కోయగూడెం బ్లాక్‌ 3, కళ్యాణకని బ్లాక్‌ 6, శ్రావణపల్లి బొగ్గు గనులను కేంద్రం టెండర్ల ప్రక్రియలో చేర్చింది. ఈ నేపథ్యంలో నూతన గనుల టెండర్లలో సింగరేణి సంస్థ కూడా ప్రైవేటుతో పోటీ పడాల్సిన ఉంటుంది. ప్రైవేటీకరణ కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వాతావరణ కాలుష్యాన్ని పెంచే ఉపరితల గనులకు స్వస్థ పలికి భూగర్భములను నిర్వహించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
రూ.2000 వేతనం పెంచి…సమ్మె విరమింప చేయాలి
గత శాసనసభ్యులు రేగా కాంతారావు కాలంలో వేతన ఒప్పందం రూ.1750 పెంచారు. ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పాటు అనంతరం స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఒప్పందం చర్చలు జలన్నప్పటికీ అందుకు యాజమాన్యం అంగీకరించలేదు. యాజమాన్యం రూ.వేయి మాత్రమే పెంచాయి. రూ.2000 వేతనం పెంచాలి. 25 మాస్టర్లు పూర్తి చేసిన వారికి గుడ్‌ విల్‌ కింద రూ.500 ఇవ్వాలి.
– వాల్వా డ్రైవర్‌ వి.సమ్మయ్య