బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు

– ఈనెల 28లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ : బీఆర్‌ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులకు ప్రివిలేజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులపై ఈనెల 28లోపు సమాధానం చెప్పాలని రాజ్యసభ చైర్మెన్‌ కార్యాలయం నోటీసుల్లో పేర్కొంది. బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, సురేష్‌రెడ్డి, దామోదర్‌రావు, రవిచంద్ర, లింగయ్య యాదవ్‌లకు కోరింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడంపై బీజేపి ఎంపీ, ఉమెన్‌, చిల్డ్రన్‌, స్పోర్ట్స్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మెన్‌ వివేక్‌ ఠాకూర్‌ రాజ్యసభ చైర్మెన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటూ… రాజ్యసభ డిప్యూటీ సెక్రటరీ అమిత్‌ కుమార్‌ ఎంపీలకు ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్‌ 18న రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీలు నిబంధనలకు విరుద్దంగా సభలో ప్లకార్డులు ప్రదర్శించారని ఎంపీ నుంచి ఫిర్యాదు అందినట్టు అందులో పేర్కొన్నారు. కాగా మహిళలు, బీసీలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, మహిళ, బీసీ రిజర్వేషన్‌ బిల్లు పెట్టాలని ఎంపీలు రాజ్యసభలో ప్లకార్డులు ప్రదర్శించారు.