కిషోరీలాల్‌ శర్మకు ప్రియాంకాగాంధీ అభినందనలు

– స్మతి ఇరానీపై భారీ మెజార్టీతో గెలుపు
అమేథీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి స్మతి ఇరానీపై కాంగ్రెస్‌ అభ్యర్థి కిషోరి లాల్‌ శర్మ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆయనకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌కు కంచుకోటైన అమేథీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ ఆయన కేరళలోని వయనాడ్‌లో గెలిచారు. తమ కంచుకోటైన అమేథీనీ తిరిగి తమ ఖాతాలో వేసుకోవడం కోసం ప్రియాంక తీవ్రంగా శ్రమించారు. దాంతో ఆమెనే అమేథీ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం కోరింది. నిరాకరించడంతో పార్టీ హైకమాండ్‌ కిషోర్‌లాల్‌ శర్మను బరిలోకి దింపింది. అనుకున్నట్టుగానే ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రి స్మతి ఇరానీపై కిషోర్‌ లాల్‌ శర్మ పోటీచేసి ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ కిషోర్‌లాల్‌ శర్మకు ఎక్స్‌ వేదికగా అడ్వాన్స్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘కిషోరి భారు, మొదటి నుంచి నాకు మీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. మీరు నెగ్గుతారని చెబుతూ వచ్చా. మీకూ, అమేథీలోని నా సోదర సోదరీమణులకు అభినందనలు’ అని ప్రియాంక తన పోస్టులో పేర్కొన్నారు.