క్రీడాకారుల ఔనత్యం మృతుల కుటుంబాలకు ప్రైజ్‌ మనీ అందజేత

క్రీడాకారుల ఔనత్యం మృతుల కుటుంబాలకు ప్రైజ్‌ మనీ అందజేత– లింగంపల్లి క్రికెట్‌ క్రీడాకారులకు అభినందనలు
నవతెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన టోర్నమెంట్‌లో గెలుపొందిన ప్రైజ్‌ మనీని బాధిత కుటుంబాలకు అందజేసి ఔనత్యాన్ని చాటారు. మంచాల మండలంలోని లింగంపల్లి క్రీడాకారులను గ్రామ ప్రజలు అభినందించారు. వారిని సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా అనిరెడ్డి రామరక్షా హాస్పిటల్‌ యాజమాని డాక్టర్‌ శ్రీలక్ష్మీ జ్ఞాపకార్థం బత్తుల కిషన్‌రెడ్డి సారధ్యంలో లింగంపల్లిలో ఎల్‌పీఎల్‌-2 క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎల్‌కే రైజర్స్‌ విజేతగా నిలిచారు. రన్నరఫ్‌గా ఎల్‌కే వారియర్స్‌ ద్వితీయ బహుమతిని స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ క్రీడాకారులకు ప్రథమ బహుమతి ద్వారా వచ్చిన రూ.10వేలను బాధిత కుటుంబానికి అందజేయాలని నిర్ణయించుకున్నారు. గత రెండు రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన మైలారం విష్ణు అనే యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబానికి అందజేసి ఔనత్యాన్ని చాటుకున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న రన్నరఫ్‌ టీం ఎల్‌కే వారియర్స్‌ టీం సభ్యులు సైతం మరో బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. అదే గ్రామానికి చెందిన చారీ అనే వ్యక్తి మృతి చెందాడు. ఇక ఎల్‌కే వారియర్స్‌ టీంచు వచ్చిన ద్వితీయ ప్రైజ్‌ మనీ చారీ కుటుంబానికి అందజేసి ఔన్నత్యాన్ని చాటారు. ఈ రెండు క్రికెట్‌ టీములను గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌ నిర్వాహకులు బత్తుల కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ లింగంపల్లిలో నిర్వహించిన టోర్నమెంటులో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడమే కాకుండా తమ సేవా నిరతిని చాటారని గుర్తు చేశారు. తమకు వచ్చిన ప్రైజ్‌ మనీని బాధ్యత కుటుంబాలకు అందజేసి తమ సేవ గుణాన్ని చాటారని చెప్పారు. వారందరికీ గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులను కొనసాగించాలని క్రీడాకారులను కోరారు. లింగంపల్లి గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో క్రికెట్‌ నిర్వాహకులు, కరుణాకర్‌ రెడ్డి, అమరేందర్‌ రెడ్డి, దంచుక బిక్షపతి, యాదయ్య, పథ్వి, శివ తదితరులు ఉన్నారు.