– ఆరంభ మ్యాచ్‌లో కిరాక్ హైదరాబాద్‌కు నిరాశ
న్యూఢిల్లీ : ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్) తొలి సీజన్ శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా మొదలైంది. కేంద్ర మంత్రి, మాజీ క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పోటీలను అధికారికంగా ఆరంభించారు. ప్రొ పంజా లీగ్ నిర్వాహకులు ప్రితీ జింఘానియా, పర్వీన్ దబాస్ సహా ప్రాంఛైజీ యజమానులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో తెలుగు జట్టు కిరాక్ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. లూథియాన లయన్స్‌తో పోరులో అండర్ కార్డ్ మ్యాచుల్లో మూడింటా పరాజయాలు చవిచూసిన కిరాక్ హైదరాబాద్..మెయిన్ కార్డ్ మ్యాచుల్లో మెప్పించింది. హైదరాబాద్ ఆర్మ్ రెజ్లర్ అక్సర్ అలీ 3-1తో తేజాస్‌పై సులువుగా గెలుపొందాడు. కానీ స్టీవ్ థామస్, షోయబ్ అక్తర్‌లు తమ మ్యాచులను 1-2తో చేజార్చుకున్నారు. కిరాక్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం బరోడా బాద్‌షాస్‌తో పోటీపడనుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ప్రొ పంజా లీగ్ తొలి సీజన్ ఫైనల్స్ ఆగస్టు 13న జరుగనున్నాయి. లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్దతిలో మ్యాచులు ముగిసిన అనంతరం పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.