– ఘోర పరాజయం
సెర్బియా : సెర్బియాలో ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్ అనుకూల ప్రతిపక్ష కూటమిపైన సెర్బియన్ అధ్యక్షుడు అలెక్జాండర్ వ్యుసిక్ విజయం సాధించాడు. 250 సీట్లుగల జాతీయ పార్లమెంట్‌లో అధ్యక్షుడి పార్టీ అయిన ఎస్‌ఎన్‌ఎస్ 46శాతం ఓట్లను సాధించగా ప్రతిపక్ష ఎస్‌పీఎన్ పార్టీకి 28శాతం ఓట్లు వచ్చాయి. 18రాజకీయ పార్టీలు పోటీపడిన ఎన్నికల్లో కేవలం అయిదు పార్టీలకే పార్లమెంట్ ప్రవేశార్హతగావున్న 3శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 120 సీట్లున్న ఎస్ ఎన్ ఎస్ పార్టీ 128సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆవిధంగా ఆ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుంది. అయినప్పటికీ కొన్ని మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముంది. మే నెలలో రెండు కాల్పుల ఘటనల్లో 18మంది మరణించిన తరువాత వ్యూసిక్ ప్రభుత్వం ఎన్నికలకు పోయి ప్రజామోదం పొందాలని నిశ్చయించింది. ఈ ఎన్నికలకు ముందు 2022లో ఎన్నికలు జరిగాయి. 2012 తరువాత సెర్బియాలో అయిదు సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి వ్యూసిక్ అధికారంలో కొనసాగుతున్నారు. వ్యూసిక్ పార్టీ సెర్బియాను యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా ఉంచాలని కోరుతున్నారు. సెర్బియా నుంచి విడిపోయిన కొసోవోను యూరోపియన్ యూనియన్ స్వతంత్ర దేశంగా గుర్తించటం ఇందుకు అడ్డంకిగా ఉంది. అంతేకాకుండా సెర్బియా రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించాలని యూరోపియన్ యూనియన్ తెస్తున్న వత్తిడిని వ్యూసిక్ ప్రభుత్వం ప్రతిఘటిస్తోంది. సెర్బియా, రష్యా దేశాలు సంప్రదాయంగా మిత్ర దేశాలుగా ఉన్నాయి.