– టీఎస్ యూటీఎఫ్ జిల్లా నాయకులు వెంకన్న, శేఖర్
– నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ – పెద్దవంగర
ఐక్య ఉద్యమాల ద్వారానే ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర వెంకన్న, జిల్లా సీనియర్ నాయకులు గుర్రం శేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల నోడల్ ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ చేతుల మీదుగా టీఎస్ యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా తక్షణమే నూతన పీఆర్సీ ప్రకటించాలన్నారు. జీవో నెంబర్ 317 సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు, డీఏ చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు కోట జనార్థన్, ప్రధాన కార్యదర్శి ధర్మారపు రమేష్, కోశాధికారి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు రాయలు, ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, యాకన్న, విజయ్ కుమార్, వెంకన్న, షౌకత్ అలీ, గౌరీ శంకర్, కవిరాజు, ప్రదీప్, రాజేష్ పాల్గొన్నారు.