– ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలు పరిష్కరించాలి
– అధ్యయనం.. పోరాటం ఎస్‌ఎఫ్‌ఐ పంతం
– నేడు చేర్యాల నుండి ప్రారంభం.. 26న సిద్దిపేటలో ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర ముగింపు
నవ తెలంగాణ – సిద్దిపేట
ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రకటించిన కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ప్రభుత్వ విద్యా సంస్థల అభివద్ధి, సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసున్నది. ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమర భేరి సైకిల్ యాత్రను చేపట్టనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్నా సీఎం కేసీఆర్ విద్యా రంగ సమస్యలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. రోజురోజుకు నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం లేదు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులు లేవు. కొత్తగా ప్రారంభించిన గురుకులాలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. అద్దె భవనాలలో అరకొర వసతులతో నడుస్తున్నాయి. కాలేజీ హాస్టల్స్‌కు సొంత భవనాలు లేవు. లెక్చరర్స్, ఉపాధ్యాయులు, వార్డెన్స్ లేక, వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం అవడం లేదు. అనేక గురుకులాలు అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. కేజీబీవీ కాలేజ్ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్‌లో సుమారు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి హాస్టల్లో నెలకు రెండుసార్లు వైద్య పరీక్షలను చేయాలని జీఓలున్నా ఎక్కడా అమలు కావడం లేదు. మెడికల్ కిట్టు సరఫరా చేయడం లేదు. నోట్‌బుక్స్, పెట్టెలు, ప్లేట్స్, దప్పట్లు, దుస్తువులు సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో, హాస్టల్లో మంచి నీళ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలు, గదులు, ఆట స్థలం, ల్యాబ్, ఫరిచర్స్ సరిగా లేవు. మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద కొన్ని పాఠశాలలు ఎంపిక కాగా, వాటిలో సంవత్సరం నడుస్తున్నా నేటికీ పనులు పూర్తి కాకపోవడం విద్యపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ కనబడుతున్నది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్‌లు అనేకం పెండింగ్లో ఉండడంతో విద్యాసంస్థలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధ్యయనం, పోరాటం, చదువుతూ పోరాడు, చదువు కోసం పోరాడు అనే నినాదంతో శాస్త్రీయ విద్య కోసం విద్యారంగ సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్ యాత్ర చేపట్టనుంది.
డిమాండ్స్
సిద్దిపేటలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో లా కాలేజీ ఏర్పాటు చేయాలి
సిద్దిపేట జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజిని ఏర్పాటు చేయాలి
చేర్యాల, దుబ్బాకలో ఉమెన్స్ డిగ్రీ కాలేజిని ఏర్పాటు చేయాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు రూ.3500 ఇవ్వాలి. కాస్మోటిక్ చార్జీలతో పాటు రూ.500 కిట్టు తక్షణమే ఇవ్వాలి
జిల్లాలో ఖాళీగా ఉన్న లెక్చరర్స్, ఉపాధ్యాయ, వార్డెన్, వర్కర్స్ పోస్టులను భర్తీ చేయాలి
అద్దె భవనాలలో నడుస్తున్న గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించాలి
విద్యార్థులకు సరిపోయే మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులను నిర్మించాలి
హాస్టల్ విద్యార్థులందరికీ ప్రతి నెల మెడికల్ చెకప్ చేయించాలి
ప్రతి సంవత్సరం విద్యార్థులకు 4 జతల బట్టలు, బ్లాంకెట్స్ సరఫరా చేయాలి
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి. వార్డెన్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలి
విద్యార్థినుల హాస్టల్స్‌కు రక్షణ కల్పించాలి. వేధించిన వారిపై క్రిమినల్ కేసులను నామోదు చేయాలి
సంక్షేమ హాస్టళ్లకు బడ్జెట్ లో అధిక నిధులను కేటాయించాలి
ఫెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి
ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం కేజి క్లాసులు ప్రారంభించాలి
విద్యారంగానికి బడ్జెట్ లో రాష్ట్రానికి 30 శాతం నిధులు కేటాయించాలి
కేజీబీవీ లో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
ప్రభుత్వ పాఠశాలల్లో తొలగించిన స్కావెంజర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
మన ఊరు-మన బడి, మన బస్తి- మనబడి ఇది అన్ని పాఠశాలలకు విస్తరించాలి. ఈపథకం అమలు కోసం నిధులు పెంచాలి
ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజిని ఏర్పాటు చేయాలి
ప్రతి మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ కు స్పేషల్ ఆఫీసర్ ను కేటాయించాలి
ప్రభుత్వ జూనియర్ కాలేజీలల్లో మధ్యాహ్లా భోజనం ఏర్పాటు చేయాలి
– జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
సైకిల్ యాత్ర రూట్ మ్యాప్
18న చేర్యాల ప్రారంభం, మద్దూర్, దూల్ మిట్ట, సంగునూర్
19న సంగునూర్ నుండి అక్కన్నపేట, హుస్నాబాద్
20న హుస్నాబాద్ నుండి కోహెడ, బెజ్జంకి
21న బెజ్జంకి నుండి చిన్నకోడూర్, నారాయణరావుపేట, చింతమడక, దుబ్బాక
22న దుబ్బాక నుండి మిరుదొడ్డి, అల్వాల, తొగుట, దౌల్తాబాద్
23న దౌల్తాబాద్ నుండి రాయపోల్, గజ్వేల్
24న గజ్వేల్ నుండి వర్గల్, ములుగు, జగదేవప్పూర్, తీగుల్
25న తీగుల్ నుండి కొమురవెళ్ళి, కొండపాక, తడ్కపల్లి, సిద్దిపేట
26 రోజున సిద్దిపేట ముగింపు బహిరంగ సభ
ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి
పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్‌కు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. విద్యా రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే నియమించాలి. హాస్టల్లో ఉండే విద్యార్థినులకు రక్షణ కల్పించాలి. నాణ్యమైన సన్నబియ్యం అందించాలి. మెస్ ఛార్జీలు పెంచాలి. క్రమంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలి. హాస్టళ్లకు, పాఠశాలలకు, కళాశాల కోసం తప్పకుండా పక్కా భవనం నిర్మించాలి. సిద్దిపేటలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. లా కళాశాలను ఏర్పాటు చేయాలి. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న సైకిల్ యాత్రను విద్యార్థులు జయప్రదం చేయాలి.
– దాసరి ప్రశాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి