వికలాంగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి..

– పెన్షన్ పెంచుతూ తీర్మానం చేసి అమలు చేయాలి
– వి.హెచ్.పి.ఎస్ జిల్లా అధ్యక్షులు…. ధరణికోట నరసింహ
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు, ఇతర పెన్షన్లు రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచుతూ తీర్మానం చేసి, వెంటనే పెంచిన పెన్షన్లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ డిమాండ్ చేశారు. మహాజన నేత మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అడిషనల్ కలెక్టర్ గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల ధర్నా కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వికలాంగుల హక్కుల చట్టం -2016 ను రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని, వికలాంగుల శాఖ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో వికలాంగులకు 5 శాతం బడ్జెట్ కేటాయించి , ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు ఎస్ కె షబ్బీర్, అనంతుల ఎల్లారెడ్డి ఎర్ర వీరన్న, బర్రె శంకర్, జిల్లా నాయకులు జాగిల్లాపురం అయిలయ్య, మచ్చ ఉపేందర్, సింగారం రమేష్,  ధనుంజయ,లాలయ్య, కరుణాకర్,ఇప్పల  రమేష్, వెంకట రమణ, యూనిస్ లు పాల్గొన్నారు.