జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం :ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి
నవతెలంగాణ-మంచా
గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా జాతీయ కోశాధికారి పుణ్యవతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన ధర్నా శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరన్నారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కార్మికులు ఐక్యంగా ఉండి సమ్మెను కొనసాగించాలని, ఐద్వా వారికి పూర్తి మద్దతు నిస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ పోచమోనీ కృష్ణ, పంచాయతీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలకేంద్రంలో కొనసాగుతున్న జీపీ కార్మికుల సమ్మెలో గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్‌ పాల్గొని మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని హామీనిచ్చి అమలు చేయలేదన్నారు. కనీసం వేతనం రూ.26,000 ఇవ్వాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు ఇవ్వాలని, 51 జీవోను రద్దు చేయాలని, ఏడాదికి రెండు జతలు బట్టలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మోతే మండలకేంద్రంలో పంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.