జీపీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

– వారి పట్ల నిర్లక్ష్యం తగదు
– సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– కొనసాగిన సమ్మె

నవతెలంగాణ- విలేకరులు
గ్రామపంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీ కార్మిక ఉద్యోగ, సిబ్బంది యూనియన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమ్మె కొనసాగింది. జీపీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్లో చేపట్టిన రిలే నిరవధిక సమ్మె శిబిరాన్ని శనివారం సీఐటీయూ నాయకులతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు సందర్శించి సంపూర్ణ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న జీపీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైందికాదన్నారు. అనేక ఏండ్లుగా అరకొర వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్న వారి వేతనాలలో మార్పు లేకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయాలని కోరారు.
తల్లాడలో గ్రామపంచాయతీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది జీపీ కార్మికులకు శ్రమకు తగిన ఫలితం అందడం లేదన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా లాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు అమలు కావడం లేదన్నారు. జీవో నెంబర్‌ 51 సవరించి మల్టీపర్పస్‌ పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంఘీభావం తెలిపారు. కొణిజర్లలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సంఘీభావాన్ని ప్రకటించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జీపీ కార్మికుల సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామన్నారు. చర్లలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగింది. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో కార్మికులు అర్ధనగ ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం సమ్మెకు సీపీఐ జిల్లా నాయకులు చెక్క వెంకటేశ్‌ సంఘీభావం తెలిపారు. భువనగిరి మండల ఎంపీడీవో ఆఫీస్‌ ముందు సమ్మె శిబిరాన్ని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు అనిల్‌ కుమార్‌రెడ్డి సందర్శించి మద్దతు తెలిపారు. వలిగొండలో సమ్మెకు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లేశం మద్దతు తెలిపారు. అడ్డగూడూరు మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులకు చౌళ్లరామారం సర్పంచ్‌ నిమ్మనగోటి జోజి, లక్ష్మీదేవికాల్వ సర్పంచ్‌ నారగోని అంజయ్యగౌడ్‌ మద్దతు తెలిపారు. కార్మికులకు చౌళ్లరామారం సర్పంచ్‌ నిమ్మనగోటి జోజి రూ.8 వేలు, లక్ష్మీదేవికాల్వ సర్పంచ్‌ నారగోని అంజయ్యగౌడ్‌ రూ.5 వేలు విరాళం అందజేశారు.
సూర్యాపేట జిల్లా మోతెలో సమ్మె ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి గంట నాగయ్య మద్దతు తెలిపారు. నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయం ముందు జీపీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మద్దతు తెలిపారు.