– పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్ (టీజీ బీపాస్) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. లేఅవుట్, భవన నిర్మాణాలకు ఆన్లైన్ ద్వారా నిర్ణీత గడువులో అనుమతులిచ్చే టీజీ బీపాస్ దరఖాస్తుల పరిష్కార పురోగతిపై గురువారం సచివాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దరఖాస్తుతో జత చేయాల్సిన డాక్యుమెంట్లు తక్కువగా ఉంటే ఆ విషయాన్ని వారికి తెలియజేసి సవరించాలని సూచించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ టీఎస్ బీపాస్ కింద హెచ్ఎమ్డీఏ, జీహెచ్ఎమ్సీలకు వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రగతిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇకనుంచి ప్రతి శనివారం టీజి బీపాస్ దరఖాస్తుల పరిష్కార ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో డీటీసీవో దేవేందర్ రెడ్డి, హెచ్ఎమ్డీఏ ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, రాజేంద్రప్రసాద్ నాయక్, జీహెచ్ఎమ్సీ చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.