అక్టోబర్‌ 18 నుంచి ప్రొ కబడ్డీ

అక్టోబర్‌ 18 నుంచి ప్రొ కబడ్డీ– హైదరాబాద్‌లో తొలి అంచె పోటీలు
ముంబయి: ఈ ఏడాది పది సీజన్ల పండుగ జరుపుకున్న ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) 11వ సీజన్‌కు సరికొత్తగా ముస్తాబవుతోంది. అక్టోబర్‌ 18 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రొ కబడ్డీ సీజన్‌ 11 ఆరంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదకొండవ సీజన్‌ నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ పాత పద్దతిలోనే జరుగనుంది. సీజన్‌ మొత్తం మూడు వేదికల్లోనే నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 18న ఆరంభ మ్యాచ్‌ సహా తొలి అంచె పోటీలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతాయి. నవంబర్‌ 10 నుంచి నోయిడా ఇండోర్‌ స్టేడియంలో రెండో అంచె పోటీలు, డిసెంబర్‌ 3 నుంచి పుణెలోని బ్యాడ్మింటన్‌ ఇండోర్‌ స్టేడియంలో లీగ్‌ దశ చివరి అంచె పోటీలు షెడ్యూల్‌ చేశారు. ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్‌, వేదిక వివరలను లీగ్‌ దశ చివర్లో వెల్లడించనున్నారు. ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ టైటిల్‌ వేటలో 12 జట్లు బరిలోకి దిగుతున్నాయి.