వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి

వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి– హెచ్‌పీఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
విద్యతో పాటు విద్యార్థులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నిర్వహించిన గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వందేండ్ల ప్రయాణంలో హెచ్‌పీఎస్‌ ప్రపంచం మెచ్చే గొప్ప మేధావులను తీర్చిదిద్దిందని కొనియాడారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్‌ సీఈవో శంతన్‌ నారాయణ, పద్మభూషణ్‌ నాగేశ్వర్‌రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు ఈ పాఠశాలకు చెందిన వారు కావడం గర్వించదగ్గ విషయమన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తాము ఎంచుకున్న లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. జీవితం ఎన్నో సవాళ్లతో ముడిపడి ఉంటుందనీ, విద్యార్థి దశ నుంచే వాటిని ఎదుర్కొవడంలో రాటు దేలాలని అన్నారు. నిరాశకు చోటివ్వకుండా ముందుకు దూసుకు పోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్దిలో పాలు పంచుకుంటున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు, బ్యూరోకాట్లు, డాక్టర్లు, న్యాయవాదులను ఈ స్కూల్‌ తయారు చేసిందని అన్నారు. ప్రధాన మంత్రి మాటల్లో చెప్పాలంటె తరగతి గదుల్లో సంచరించే విద్యార్థులు భవిష్యత్‌ దిక్సూచీలని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇతర ప్రాపంచిక అంశాలను పరిచయం చేస్తూ విద్య, నైపుణ్యం, క్రీడలకు ప్రాముఖ్యతనిస్తూ కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానాన్ని హెచ్‌పీఎస్‌ పాటిస్తోందని అన్నారు. ఫలితంగా ఉత్తమమైన ఫలితాలను సొంతం చేసుకుంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.