కులగణనను స్వాగతిస్తున్నాం ప్రొఫెసర్‌ కోదండరాం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కులగణనను స్వాగతిస్తున్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి, దాని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందోనని కోదండరాం విమర్శించారు.
మూసీ నది పునరుద్ధరణ అవసరమైన అద్భుతమైన కార్యక్రమమని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అభినందించారు. నదులు, చెరువుల పునరుద్ధరణతో కలిగే ప్రయోజనాలు అందరికీ అందించాలని, ప్రజా సంక్షేమానికి ఇది ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
చిలగాని సంపత్‌ కుమార్‌ స్వామి చేరిక
తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చిలగాని సంపత్‌ కుమార్‌స్వామి బుధవారం టీజేఎస్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం సమక్షంలో టీజేఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్‌, పల్లె వినరు కుమార్‌, యూత్‌ రాష్ట్ర అధ్యక్షులు సలీమ్‌ పాష, టీజేఎస్‌ గ్రేటర్‌ హైదరాబాదు జిల్లా అధ్యక్షులు నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్‌, పార్టీ కార్మిక విభాగం నాయకులు ఆకుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.