కులగణన తప్పుల తడక : ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కులగణనంతా తప్పుల తడకగా ఉందనీ దీనిపై నిపుణుల కమిటీ వేయాలని ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ డిమాండ్‌ చేశారు. పీపుల్స్‌ కమిటీ ఆన్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ అండ్‌ బీసీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద ్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కులగణన సర్వే-స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రభుత్వ ప్రకటనలో అస్పష్టత’ అంశంపై విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీమనోహర్‌ మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలు ఈ అంశంపై దోబూచులాడుతున్నాయని విమర్శించారు.
కుల గణనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని చెప్పారు. అందులో వాస్తవాలు లేవనీ, అన్నీ అబద్ధాలే అని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిం చారని చెప్పారు. ఇప్పటికైనా నిపుణుల కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లకు, బీసీలకు బీజేపీ వ్యతిరేకమైందని తెలిపారు. మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే కులగణన విషయం లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాహుల్‌గాంధీ చేసిన ప్రచారంలో అన్ని స్థాయిల్లో కూడా సివిల్‌ సొసైటీ సంస్థల సలహా, సూచనలను తీసుకోవాలని సూచించినా పట్టించుకోలేదని తెలిపారు. ప్రొఫెసర్‌ తిరుమలి మాటా ్లడుతూ కులగణనకు ఎలాంటి విశ్వసనీయతా లేదని చెప్పారు. ఇదంతా తప్పుల తడకగా ఉందన్నారు. విలేకర్ల సమావేశంలో ప్రొఫెసర్‌ ఎస్‌ సింహాద్రి, దేవళ్ల సమ్మయ్య, డాక్టర్‌ పృద్వీరాజ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.