ప్రొఫెసర్‌ సాయిబాబా కేసును మరోసారి విచారించాలి

– విచారణను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలి
– నిర్దోషిగా ప్రకటించిన ముంబయి హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం
న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబాకు బుధవారం సుప్రీంకోర్టులో భారీ షాక్‌ తగిలింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ కేసును తాజాగా మళ్లీ విచారించాలనీ, విచారణను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని తీర్పునిచ్చింది. ముంబయి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సిటి రవి కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వి రాజు, నిందితుల తరపున సీనియర్‌ న్యాయవాదులు ఆర్‌. బసంత్‌, నిత్య రామకృష్ణన్‌, న్యాయవాది షాదన్‌ ఫరాసత్‌ వాదనలు వినిపించారు.
కేసు పూర్వాపరాలు
మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ మహారాష్ట్ర పోలీసులు 2013లో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జిఎన్‌ సాయిబాబా (52)పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2014 మే 9న సాయిబాబాను ఢిల్లీలో అరెస్టు చేశారు. కోర్టు అతనిని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. అప్పటికే ఈ వ్యవహారంలో మరో ఐదుగురు.. మహేశ్‌ టిర్కీ, హేమ్‌ కేశవదత్త మిశ్రా, ప్రశాంత్‌ రాహి, విజరు నాన్‌ టిర్కీ, పాండు పొరా నరోతే జైల్లో ఉన్నారు. మావోయిస్టులతో సంబంధాలతో పాటు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) సెక్షన్‌ 45 (1), భారత శిక్షాస్మృతి (ఐపీసీ) కింద గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు ఈ ఆరుగురిపైనా అభియోగాలు నమోదు చేసింది. ఆ తరువాత సాయిబాబాను ప్రాసిక్యూట్‌ చేసేందుకు శాంక్షనింగ్‌ అథారిటీ ఆమోదం తెలిపింది. 2015 అక్టోబరు 31న పోలీసులు అనుబంధ చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం 2017 మార్చి 3న వారిని కోర్టు దోషులుగా ప్రకటించింది. సాయిబాబా సహా ఐదుగురికి జీవిత ఖైదు, ఒకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఆరుగురూ అదే ఏడాది మార్చి 29న తమకు శిక్ష విధింపును ముంబయి హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌ ముందు సవాల్‌ చేశారు. సాయిబాబాకు సెషన్స్‌ కోర్టు విధించిన జీవిత ఖైదు, జైలు శిక్షను హైకోర్టు కొట్టివేసింది. 2022 అక్టోబర్‌ 14 ముంబయి హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును జాతీయ దర్యాప్తు సంస్థ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నాలుగు నెలల్లో మెరిట్స్‌ ఆధారంగా మళ్లీ సాయిబాబా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. గతంలో నిర్దోషిగా ప్రకటించిన ధర్మాసనంతో కాకుండా మరో ధర్మాసనంతో విచారణ జరిపించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.