ధనిక దేశాల లాభాపేక్ష- మానవాళికి వినాశకరం

The profit motive of the rich countries is disastrous for humanityఇప్పుడు సమస్య పునరుత్పాదక ఇంధన ధరలు కాదు. అమెరికాలో చమురు, సహజ వాయువు, బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ సంస్థలు మూత పెట్టడం. మానవ నాగరికత పెను ప్రమాదం అంచున ఉన్నప్పటికీ అమెరికా ఈ కంపెనీల ప్రయోజనాలు ఎలా కాపాడాలా అని చూస్తున్నది. మన దేశంలో సంప్రదాయ ఇంధన వనరుల పరిశ్రమలను యాథాతథంగా కొనసాగించడానికి కర్బన వాణిజ్యం, కర్బన సుంకాల పేరిట కొత్త నాటకం మొదలు పెట్టింది. గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను చారిత్రకంగా లెక్కించడం కాకుండా తాజా ఉద్గారాలను ప్రాతిపదికగా తీసుకోవడమంటే అది వర్థమాన దేశాల ప్రయోజనాలను దెబ్బతీయడమే. ప్రస్తుత వాతావరణ సంక్షోభానికి కారణమైన ధనిక దేశాలు తమ బాధ్యత నుండి తప్పించుకోవడమే.
‘కాప్‌’ 29 సదస్సు కనీసం కూనిరాగంగా కూడా ముగియ లేదు. ‘కాప్‌’ 28 సదస్సు అనంతరం శిలాజ ఇంధనాల శకానికి స్వస్తి పలుకుదామని ప్రకటించారు. వాతావరణ మార్పులు, పేదరికం-జమిలి ప్రమాదాలను ఎదుర్కొంటున్న వర్థమాన దేశాలకు భూరి సాయం అందిస్తామని వాగ్దానం చేసిన ధనిక దేశాలు ఆ వాగ్దానాల నుండి వెనకడుగు వేశాయి. శిలాజ ఇంధనాల వాడకాన్ని-ముఖ్యంగా చమురు, సహజ వాయువులను క్రమబద్ధంగా ఉపసంహరించుకోవడం గురించి నిర్దిష్టమైన హామీ ఏదీ ప్రకటించకపోగా వర్థమాన దేశాలకు వాణిజ్య, వాణిజ్యేతర రూపాల్లో 1.3 లక్షల కోట్ల డాలర్ల సాయం అవసరం ఉండగా కేవలం 300 కోట్ల డాలర్ల సాయం అదీ 2033 నాటికి అంది స్తామని ప్రకటించాయి. వర్ధమాన దేశాలకు అవసరమైన 1.3 లక్షల కోట్ల డాలర్ల సాయం అందిస్తామని ఒక ‘ప్రవిత్రమైన ఆకాంక్ష’ను వెలి బుచ్చడంతో సరిపెట్టాయి. వాతావరణ మార్పులు, పేదరికం ప్రమాదాలను ఎదుర్కొంటున్న పేద దేశాలకైనా ఒకింత ఆర్థిక సాయం ప్రకటించలేదు.
ధనిక దేశాలు ప్రకటించిన 300 కోట్ల డాలర్ల సాయంలో అప్పులు, వాణిజ్య రుణాలు ఉన్నాయి. అంటే ‘హరిత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చే పేరిట వర్ధమాన దేశాల మౌలిక సౌకర్యాల వ్యవస్థను ధనిక దేశాలు కబళించేందుకు చూస్తున్నాయి. ఇది నయా వలస దోపిడీ సాగించడానికి వేసిన ఎత్తుగడ తప్ప వేరొకటి కాదు. ధనిక దేశాలు ఇవ్వజూపుతున్న ‘సాయం’లో కర్బన మార్కెట్ల వాణిజ్యం కూడా ఒకటి. ఇది సార్వభౌమ దేశాల ప్రజలను మోసగించడం మినహా మరొకటి కాదు. కర్బన మార్కెట్ల వాణిజ్యం ద్వారా ఆ యా దేశాల ఉద్గారాలను తగ్గించడం సాధ్యం కానే కాదు. వాతావరణ మార్పులను అరికట్టే పేరిట ధనిక దేశాలు, వాటి బహుళజాతి సంస్థలు కపట నాటకం ఆడుతున్నాయి.ఇంధన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానమైన విద్యుత్‌రంగ పరిణామాల వరకే నేను ఈ వ్యాసంలో పరిమితం అవుతాను. రవాణా రంగంలో మార్కెట్‌ శక్తులు అత్యంత నాటకీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, అమ్మకాల వైపు మొగ్గాయి. వ్యవసాయం, పరిశ్రమల రంగాలలో విద్యుత్‌ అవసరాలు ఎంత కీలకమో అందరికీ తెలిసినదే. ఇప్పుడు నేనా విషయాల లోతుల్లోకి వెళ్లడం లేదు. 18వ శతాబ్దం మధ్య కాలం నుండి పరిశ్రమలకు, గృహావసరాలకు విద్యుత్‌ వినియోగం మొదలు కావడంతో వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగసాగాయి. అలాగే రవాణా రంగంలో కార్లు, బస్సులు, లారీలకు పెట్రోలు, డీజిల్‌ వినియోగం పెరగడం, రైళ్లు నడిపేందుకు ఆవిరి/బొగ్గు వినియోగం పెరగడంతో భూగోళ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
1980వ దశకానికి వచ్చేసరికి వాతావరణ మార్పులకు సంబంధించిన శాస్త్రీయమైన అధ్యయనం, గణాంకాలు అందుబాటులోకి వచ్చాయి. చమురు, సహజ వాయువుల వెలికితీత వ్యాపారంలో ఉన్న బడా కార్పొరేషన్లకు..అవి వాతావరణంలోకి ఏ మేరకు గ్రీన్‌హౌస్‌ వాయువులకు (కర్బన ఉద్గారాలకు) కారణభూతం అవుతున్నాయో తెలిసికూడా వాటిని అరికట్టే మార్గాల మీద దృష్టి పెట్టలేదు. పైపెచ్చు వాతావరణ మార్పులు అనేవి నిరాధార అంచనాలను ప్రచారం చేసే, కొట్టి పారేసే సంస్థలకు, వ్యక్తులకు నిధులు సమకూర్చి మరీ ప్రచారానికి ఊతమిచ్చాయి. మానవ నాగరికతకు వినాశనం దాపురించినా సరే ఈ సంస్థలకు తాము గడించే లాభాలే ముఖ్యం అయిపోయాయి.శిలాజ ఇంధనాల ప్లాంట్లకన్నా పునరుత్పాదక ఇంధన తయారీ పాంట్ల పెట్టుబడి, నిర్వహణ వ్యయాలు తక్కువ కావడంతో ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడ్డాయి. వాస్తవానికి పునరుత్పాదక ఇంధనానికి సూర్యుని వేడిమి, సహజంగా వీచే గాలి ప్రధాన వనరులు కావడంతో ఈ ప్లాంట్ల నిర్వహణకయ్యే వ్యయం సున్నా. శిలాజ ఇంధనాల ఉత్పత్తి కేంద్రాల పెట్టుబడి వ్యయాలను కార్పొరేషన్లు ఏనాడో తిరిగి రాబట్టుకున్నాయి. ఈ ప్లాంట్ల నుండి సరఫరా అయ్యే విద్యుత్‌ కోసం మనం చెల్లిస్తున్న చార్జీలు కేవలం ప్లాంట్ల ఇంధన ఖర్చులే. గాలి వీచని రోజున, సూర్యుడు వెలుగు ఇవ్వని రోజున మనకు ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌ అవసరం పడుతుంది. పవన, సౌర విద్యుత్‌లు అందుబాటులో లేని సమయాల్లో పవర్‌గ్రిడ్‌ల నుండి మనకు విద్యుత్‌ సరఫరా అయ్యేలా చూడడానికి అవసరమైన విద్యుత్‌ నిల్వ కేంద్రాలను మనం ఇప్పటికీ రూపొందించు కోలేదు. అయినా ఈ సమస్యను కూడా సాంకేతికంగా అధిగమించాం. ‘పంప్డ్‌ స్టోరేజి’ బ్యాటరీ పని తీరుకు సమానమైనది. ‘పురూలియా’ పవర్‌ గ్రిడ్‌లో మనకు ఈ సౌకర్యం ఉన్నది కాబట్టి సమస్యకు పరిష్కారం దొరికినట్లే. ఇందుకోసం ‘గ్రిడ్‌’ల స్ధాయిలో భారీ ఎలక్ట్రికల్‌ బ్యాటరీల అవసరం కూడా ఉండదు.
శిలాజ ఇంధన వినియోగం నుండి పునరుత్పాదక ఇంధన వినియోగం వైపు మళ్లడానికి మనకు కావల్సినదల్లా సౌర విద్యుత్‌ ఉత్పాదనకు అవసరమైన ఫలకాలు, పవన విద్యుత్‌ ఉత్పాదనకు అవసరమైన భారీ పంకాలు పరిశ్రమ స్ధాయిలో ఉత్పత్తి చేసి నెలకొల్పుకోవడమే. తద్వారా మనం శిలాజ ఇంధనాల ప్లాంట్ల నుండి క్రమేపీ వైదొలగవచ్చు. గ్రిడ్‌ల మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి మనం విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తే ఇంధన సంబంధిత కర్బన ఉద్గారాలను నలభై శాతం తగ్గించవచ్చు. గత పదేండ్లుగా సౌర, పవన విద్యుత్‌ ఉద్పాదనలను గ్రిడ్‌లతో అనుసంధానించడం పెరిగింది. దానితో బొగ్గు, సహజ వాయువు, చమురు ఉపయోగించి ఉత్పత్తి చేసే ఒక కిలోవాట్‌ వ్యయం కన్నా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయం చాలా స్వల్పంగా లెక్క తేలింది. 2023లో గ్రిడ్‌ల సామర్థ్యం పెంపు మూలంగా మనకు శిలాజ ఇంధ నాల వినియోగం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ అవసరం లేకుండా పోయింది. ప్రపంచ వ్యాప్తంగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగాయి. ముఖ్యంగా చైనా చాలా వేగం అందుకుంది. ప్రత్యామ్నాయ పునరుత్పాదక విధానం ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ మూలంగా కర్బన ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ జనాభాలో 3/4వ వంతు జనాభా నివసిస్తున్న దేశాలకు ఇది ప్రయోజనకరం.
ఈ దిశగా చైనా చేపట్టిన కృషిని శ్లాఘిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన వ్యాసం చదివితే ఈ పత్రిక చైనా అభిమాన సంఘంలో చేరిపోయిందా అన్న అనుమానం రాకమానదు. ‘2023లో చైనా సహా ప్రపంచవ్యాప్తంగా 425 గిగావాట్‌ల సామర్థ్యంగల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు స్థాపించారు. చైనా ఒక్కటే 263 గిగావాట్‌ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాలు స్థాపిస్తే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కలిసి 162 గిగావాట్‌ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాలను స్థాపించాయి. ఇందులో అమెరికా వాటా కేవలం 33 గిగావాట్‌లు. 2019లో ప్రపంచ సౌర విద్యుత్‌ సామర్థ్యంతో 1/4వ వంతు సామర్థ్యాన్ని ఒక్క చైనాయే సాధించింది. 2023 నాటికి అదే చైనా ప్రపంచ సౌర విద్యుత్‌ సామర్థ్యంలో 62 శాతం సొంతం చేసుకుంది. చైనా సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది రెట్లు పెంచుకుంది. చైనా ఉత్పత్తి సామర్థ్యం ఇంత పెద్ద ఎత్తున పెరగకుండా ఉంటే ప్రపంచదేశాల సౌర విద్యుత్‌ సామర్థ్యం కనీసం రెట్టింపు పెరగడం కూడా సాధ్యపడేది కాదు’ అని పత్రిక పేర్కొంది.
హరిత ఇంధన సామర్థ్యంలో చైనా అగ్రగామిగా, అమెరికా అట్టడుగున నిలిచాయి. ఐరోపా యూనియన్‌ దేశాలు, భారతదేశం 2023లో 13.5 గిగావాట్‌ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేశాయి. అయితే ఈ రెండు దేశాలు సౌర ఫలకాల ద్వారా విద్యుత్‌ ఉత్పాదన విధానం మీద ప్రధానంగా ఆధారపడ్డాయి. ‘సెల్‌’ ఉత్పత్తి విధానాన్ని పెంపొందించుకోలేదు. అదానీ సౌర విద్యుత్‌ సంస్థ, సెకిల మధ్యన ఆంధ్రప్రదేశ్‌కు ఏడు గిగావాట్‌ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం జరిగిన ఒప్పందంలో ముడుపుల భాగోతం నడిచిందని అమెరికా న్యాయాధికారులు అభియో గాలు నమోదు చేయడం మూలంగా సౌర విద్యుత్‌ ఉత్పాదన మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐరోపా యూనియన్‌ దేశాలు హరిత ఇంధన విధానాలను రూపొందించి ఆర్భాటంగా ప్రకటిం చాయి. కానీ ఇప్పటికీ శిలాజ ఇంధనాల విద్యుత్‌ మీదనే ఎక్కువగా ఆధారపడ్డాయి. ఇంకా చెప్పాలంటే వాతావరణ మార్పులను అరికట్టే పేరిట సుంకాల ఆటంకాలు సృష్టిస్తున్నాయి. అమెరికా ప్రయోజ నాలతో అంటకాగడం మూలంగా ప్రపంచ భవిష్య త్తునే కాకుండా స్వదేశీ పరిశ్రమల భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. రష్యాపై అమెరికా విధిóంచిన ఆర్థిక ఆంక్షల కారణంగా దేశం నుండి చౌకగా లభించే చమురు, సహజ వాయువుల కొను గోళ్లు నిలిపివేసి అమెరికన్‌ బహుళజాతి సంస్థల నుండి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాయి ఐరోపా దేశాలు.
భారత్‌, చైనా, టర్కీ, రష్యా, తూర్పు ఆసియా దేశాలలో చౌకగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ కొనుగోళ్లను దెబ్బ తియ్యడానికి ‘కర్బన సుంకాల’ విధింపు పేరిట అమెరికా-ఐరోపా యూనియన్‌ దేశాలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఈనెలలోనే అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న డొనాల్డ్‌ ట్రంప్‌, అర్జెంటీనా ప్రస్తుత అధ్యక్షుడు జేవియర్‌ మిలేలు ఇద్దరూ వాతావరణ మార్పులు అన్న అంశాన్ని కొట్టిపారేసే ఘనులు. రానున్న కాలంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక విధానాలు తీవ్రమైన మార్పులకు గురయ్యే ప్రమాదం ఉన్నది. ప్రపంచం ఎలా పోయినా వీళ్లకి బహుళజాతి సంస్థలు సంపాదించే లాభాల ప్రయోజనాలను కాపాడటమే ముఖ్యం. అంటే ప్రపంచం ఇవాళ రాజకీయంగా పెనుసవాల్‌ను ఎదుర్కోనున్నది. ఇది ఆర్థికపరమైన, సాంకేతిక పరమైన సవాలు కానే కాదు. విలువలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ ‘పేరిట అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడుతుంటే జి-7 దేశాలు దానిని ఎదుర్కోవడానికి సాహసించడం లేదు. ప్రపంచ దేశాల మీద నయా వలస దోపిడీ కొనసాగుతున్నా ప్రశ్నించలేకుండా ఉన్నాయి. ఫ్రెంచి విప్లవానికి ముందు పదహారవ లూయిస్‌ చక్రవర్తి ”నేను పోతే ప్రళయమే’ అని హెచ్చరించిన చందంగా ధనిక దేశాలు వ్యవహరిస్తున్నాయి.
ప్రబీర్‌ పుర్కాయస్థ