రాంకీ ఇన్‌ఫ్రాకు రూ.57.5 కోట్ల లాభాలు

రాంకీ ఇన్‌ఫ్రాకు రూ.57.5 కోట్ల లాభాలు– రూ.280 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి
హైదరాబాద్‌ : వచ్చే ఆరు మాసాల్లో రూ.280 కోట్ల నిధులు సమీకరించనున్నామని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వైఆర్‌ నాగరాజు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ ఎన్‌ఎస్‌ రావుతో కలిసి రాంకీ ఇన్‌ఫ్రా ఆర్థిక ఫలితాలను వెల్లడించారు. ఆ వివరాలు.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ నికర లాభాలు 94.67 శాతం తగ్గి రూ.57.5 కోట్లుగా నమోదయ్యాయని ఎన్‌ఎస్‌ రావు తెలిపారు. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,077.08 కోట్ల లాభాలు ఆర్జించిందన్నారు. ఇదే సమయంలో రూ.576.43 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ గడిచిన క్యూ4లో 0.83 శాతం పెరిగి 581.19 కోట్లకు చేరిందన్నారు. ఆర్థిక సంవత్సరం 2023-24 రాంకీ ఇన్‌ఫ్రా నికర లాభాలు 73.01 శాతం తగ్గి రూ.307.79 కోట్లుగా చోటు చేసుకున్నాయని తెలిపారు. సంస్థ వద్ద రూ.9,300 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉందన్నారు. బుధవారం బిఎస్‌ఇలో ఆ సంస్థ షేర్‌ 7.66 శాతం పెరిగి రూ.527.85 వద్ద ముగిసింది.