క్రీడల్లో పురోగాభివృద్ధ్ది

కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా నిధులు, టోర్నీల కేటాయింపుల్లో వివక్ష చూపిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వ సంకల్ప దీక్ష, చిత్తశుద్దితో క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా దూసుకెళ్తుందని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది సంబురంలోకి అడుగుపెట్టిన వేళ తొమ్మిదేండ్లలో క్రీడా రంగం పురోగాభివృద్ది సాధించిందని వెల్లడించారు. దశాబ్ది వేడుకల సందర్భంగా నవతెలంగాణతో శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ ప్రత్యేక
ఇంటర్వ్యూ..

 కేంద్రం వివక్ష చూపినా..పురోగాభివృద్ది
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపుతుంది. ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిధులను బిజెపి పాలిత రాష్ట్రాలకే కేటాయిస్తున్నారు. 80 శాతం నిధులను గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకే మంజూరు చేశారు. నిధులతో పాటు ఖేలో ఇండియా క్రీడల ఆతిథ్య హక్కులను సైతం బిజెపి పాలిత రాష్ట్రాలకు మాత్రమే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కేంద్ర వివక్ష చూపినా.. తెలంగాణ క్రీడల్లో పురోగాభివృద్ది సాధించింది. క్రీడా రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతుందని శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు.
 ప్రతి నియోజకవర్గానికి ఓ స్టేడియం నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కెసిఆర్‌ క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాట్స్‌ ఆధ్వర్యంలో 1104 ఎకరాల భూమి క్రీడా మైదానాల కోసం కేటాయించబడింది. గతంలో జిల్లాకు ఓ స్టేడియం సైతం ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ స్టేడియం నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పటికే 75 నియోజకవర్గాల్లో స్టేడియాల నిర్మాణం పూర్తయ్యింది. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో స్టేడియాలు అందుబాటులోకి రానున్నాయి. స్టేడియాల నిర్మాణం, ఆధునీకరణకు రూ. 231.56 కోట్లు మంజూరు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితోనే ఇది సాధ్యపడింది.
 క్రీడా ప్రాంగణాలతో గ్రామీణ క్రీడలకు జీవం
పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన క్రీడాభివృద్దిని తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాం. రాష్ట్ర వ్యాప్తంగా 12685 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో ఇదోక నూతన అధ్యాయం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్స హించి, ప్రధాన స్రవంతి వేదికపైకి తీసుకురావటమే లక్ష్యంగా శాట్స్‌ పని చేస్తోంది. నిత్యం ఆటల పోటీలతో క్రీడా ప్రాంగణాలు కళకళలాడు తున్నాయి. గ్రామీణ క్రీడలకు క్రీడా ప్రాంగణాలు జీవం పోశాయి. ప్రతి గ్రామానికి 23 క్రీడా పరికరాలతో కూడిన స్పోర్ట్స్‌ కిట్‌, 75 టీ షర్ట్‌లను అందజేయనున్నాం.
 ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాలు
ఎన్నో అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఘనత హైదరాబాద్‌, తెలంగాణ సొంతం. మన క్రీడాకారుల అవసరాలకు తగినట్టుగా, అంతర్జాతీయ పోటీల నిర్వహణకు అనుగుణంగా ప్రపంచ శ్రేణి మౌళిక సదుపాయాలు కల్పించాం. ప్రతి జిల్లా కేంద్రంలోని స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. క్రీడా పాఠశాలలతో పాటు స్టేడియాల్లో వ్యాయామశాలలు ఏర్పాటు చేశాం. మెదక్‌, వరంగల్‌, కరీంనగర్‌లో 8 లేన్‌ 400 మీటర్ల సింథటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌లను రూ.19.50 కోట్లతో నిర్మించాం.
ఆకర్షణీయ నగదు ప్రోత్సాహకాలు
దేశంలో మరో రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో క్రీడా కారులకు భారీ నగదు ప్రోత్సాహకాలు అంది స్తున్నాం. నగదు ప్రోత్సాహకాలను సీఎం కెసీఆర్‌ భారీగా పెంపుదల చేశారు. బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, హుస్సా ముద్దీన్‌.. షట్లర్లు పి.వి సింధు, షుటర్‌ ఇషా సింగ్‌లకు నగదు ప్రోత్సాహకంతో పాటు విలువైన ఇంటి స్థలాలు కేటాయించాం. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇప్పటి వరకు రూ.25.38 కోట్లు, నగదు ప్రోత్సాహకాలుగా రూ.5.31 కోట్లు అందజేశాం. రాష్ట్రంలో క్రీడా సంఘాలకు రూ.9.19 కోట్ల నిధులు ఇవ్వటం జరిగింది.
 పతకాల వేటలో మనోళ్ల దూకుడు
అంతర్జాతీయ, జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో బర్మింగ్‌హామ్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో మన క్రీడాకారులు ఆరు పతకాలు సాధించారు. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు గెలుపొందారు. 36వ జాతీయ క్రీడల్లో మన క్రీడాకారులు 23 పతకాలు కొల్లగొట్టారు. 8 పసిడి పతకాలు, ఏడు సిల్వర్‌ మెడల్స్‌, 8 కాంస్య పతకాలు సాధించారు. ఖేలో ఇండియా క్రీడల్లోనూ తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.
సీఎం కప్‌తో మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్‌
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి సీఎం కప్‌ పోటీలను నిర్వహించాం. 18 క్రీడాంశాల్లో మహిళలు, పురుషులకు మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్‌ విజయవంతంగా నిర్వహించాం. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలతో క్రీడా రంగానికి నూతన ఉత్తేజం వచ్చింది. వచ్చే ఏడాది సీఎం కప్‌ టోర్నీలో 25 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించబోతున్నాం. సీఎం కప్‌ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామీణ క్రీడాకారులకు శాట్స్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నాం.