రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలి

– కేటీఆర్‌ ట్వీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై బురద జల్లకుండా ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రగతి, సక్సెస్‌ ఫుల్‌ మోడల్‌ పై ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్‌ ది ఎకానమిస్ట్‌ కథనంలో ఇచ్చిన లెక్కలను ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివద్ధి మోడల్‌గా తయారైందని ఆ కథనంలో పేర్కొన్నారు. విద్యుత్‌, ఐటీ ఎగుమతులు, ఐటీ ఉద్యోగాలు, జీడీపీ పెరుగుదల తదితర గణాంకాలను పేర్కొన్నారు.
ఆ బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్‌ సర్కారే
-భట్టికి వినోద్‌ కుమార్‌ కౌంటర్‌
మైన్స్‌, మినరల్స్‌ బిల్లును పార్లమెంటులో 2011లో ప్రవేశపెట్టింది మన్మోహన్‌ సర్కారే అని బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ బిల్లుకు 2015లో బీఆర్‌ఎస్‌ మద్ధతిచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. యూపీఏ హయంలో స్టాండింగ్‌ కమిటీ సూచనలతో వచ్చిన బిల్లునే బీజేపీ సర్కార్‌ ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చిందని వివరించారు. భట్టి బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిలో బొగ్గు నిల్వలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి వేలాన్ని నిలిపివేయాలని కోరారు.