ఛాందసవాది కుమారుడైన అభ్యుదయవాది శ్రీధర్‌ తిలక్‌

ఛాందసవాది కుమారుడైన అభ్యుదయవాది శ్రీధర్‌ తిలక్‌25మే 1928న పూనా- బొంబాయి ఎక్స్‌ ప్రెస్‌ ట్రైన్‌ కిందపడి శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ అత్మహత్య చేసుకున్నారు. చేసుకోవడానికి ముందు ఆయన ముగ్గురికి సుసైడ్‌ నోట్స్‌ పంపారు. ఒకటి పూనె కలెక్టర్‌కి, రెండోది వార్తాపత్రికకు, మూడోది డా.బి. ఆర్‌. అంబేద్కర్‌కు. ఆయన మరణం తర్వాత ఆ ఉత్తరాన్ని ‘సమతా’ అనే పత్రిక 29 జూన్‌, 1928 న ప్రచురించింది. అంబేద్కర్‌కు రాసిన ఉత్తరం లోని సారాంశం ఇలా ఉంది.
”ఈ ఉత్తరం మీకు చేరేసరికి నా మరణవార్త వింటారు. మీరు ఆశిస్తున్న సమతా – సమాజ్‌ – సంఫ్‌ు ఇంకా ముందుకు సాగాలంటే విద్యావంతు లను, సమాజంలో మార్పు ఆశించే యువకులను ఉద్యమం వైపు ఆకర్షించాలి. లక్ష్యసాధన కోసం మీరు నిరంతరం పడుతున్న శ్రమ, పట్టుదల నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మీకు విజయం కలుగుతుందని నాకు పూర్తి నమ్మకముంది. మహారాష్ట్రలో ఉన్న యువత అంటరానితనాన్ని నిర్మూలించడా నికి పూనుకుంటే, సమస్య కేవలం ఐదు సంవత్సరాల్లో పరిష్కార మౌతుంది – అందరికీ నా అభినందనలు”.
ఇంతకీ శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ ఎవరో ఈ తరం యువతీయువ కులకు తెలిసి ఉండకపోవచ్చు. చాలా మంది లోకమాన్య బాల గంగాధర తిలక్‌ పేరు వినే ఉంటారు కదా? ఆయన మూడవ కుమారుడే శ్రీధర్‌ బల్వంత్‌ తిలక్‌. శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ (1896- 25 మే1928)గా ప్రసిద్ధులు. తండ్రి ఆలోచనా ధోరణికి పూర్తి భిన్నమైన ఆలోచనా ధోరణి గలవారు. పైగా డా.బి.ఆర్‌. అంబే ద్కర్‌కు చాలా సన్నిహిత మిత్రులు. తండ్రి బాల గంగాధర తిలక్‌ కులవ్యవస్థ, అంటరానితనం ఉండాలన్నారు కానీ, కొడుకు శ్రీధర్‌ తిలక్‌ వాటిని బద్దలు కొట్టాలన్నారు. హిందువులను ఏకం చేయ డానికి ఇళ్ళలో ఉన్న గణపతిని వీధుల్లోకి తెచ్చిన ఘనుడు బాల గంగాధర తిలక్‌. దాని వికృత రూపాలు మనం ఈ నాటికీ అను భవిస్తున్నాం. తండ్రి బాల గంగాధర తిలక్‌ ప్రభావంలో పడ కుండా అంటరాని తనాన్ని నిర్మూలించడానికి, సమాజంలో సమానత్వం సాధించడానికి శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ సమాజ్‌ సమతా సంఫ్‌ు ను స్థాపించారు. అంబేద్కర్‌కు సన్నిహితుడు కావడానికి ఇదొక ప్రధాన కారణం. అంబేద్కర్‌ నిర్వహించే దాదాపు అన్ని కార్యక్రమాలలో శ్రీధర్‌ తిలక్‌ చాలా చురుకుగా, ఉత్సాహంగా పాల్గొనేవారు. 2 అక్టోబర్‌ 1927 రోజున పూనాలో ఒక పెద్ద సమావేశం జరిగింది. అది అణగారిన వర్గాల విద్యార్థుల సమా వేశం దానికి అంబేద్కర్‌ అధ్యక్షత వహించారు. శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ అందులో ఒక ముఖ్య వక్తగా పాల్గొన్నారు.
అలాగే, అంటరాని బాలురను శ్రీధర్‌ తిలక్‌ ప్రత్యేకంగా తన ఇంటికి భోజనానికి ఆహ్వానించి, తరచూ సహభోజన కార్యక్ర మాలు నిర్వహించే వారు. ఆ రకంగా బ్రాహ్మణ ధర్మకర్తలను ధిక్కరించి, వారి ఆగ్రహానికి గురయ్యేవారు. లోకమాన్య బాల గంగాధర తిలక్‌ ఉన్నప్పుడు. ఆయన నివాసాన్ని లోకమాన్య నివాస్‌గా అందరూ గుర్తించేవారు. ఆయన మరణం తర్వాత కొడుకు శ్రీధర్‌ తిలక్‌ కూడా అదే ఇంట్లో నివాసముండేవారు. అయితే ఈయన అదే లోకమాన్య నివాస్‌ ఇంటి ముందు ‘చతుర్వర్ణ విధ్వంసక సమితి’ అనే బోర్డు తగి లించారు. ఫలితంగా తన తండ్రి ప్రారంభించిన ‘కేసరి’ పత్రికలోనే తనను విమర్శిస్తూ, ఒక్కోసారి అవమానిస్తూ వ్యాసాలు ప్రకటింపబడుతూ ఉండేవి. బ్రాహ్మణాధిక్యతను నిలపాలని తాపత్రయపడే ఆయన తండ్రి అనుయాయులు, అభిమానులు అవి రాసి ప్రచురించేవారు. శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ పై బంధువుల, తండ్రి స్నేహితుల ఒత్తిడి విపరీతంగా ఉండేది. అభ్యుదయవాది అయినందుకు ఆయనను ఘోరంగా అవమా నిస్తూ తండ్రి ప్రారంభించిన పత్రికలోనే వ్యాసాలు రావడం బాధాకరంగా ఉండేది.
ఇంటా బయటా ఇన్ని రకాల ఒత్తిళ్ళు భరించలేకనే శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని అతి సన్ని హితంగా ఉండి పరిశీలించిన అంబేద్కర్‌ ధృవీకరించారు. ఆ మరునాడు 26 మే 1928న జరిగిన సంతాప సభలో శ్రీధర్‌ తిలక్‌ సేవలను కొనియాడుతూ తీర్మానం చేశారు. సమతా పత్రిక ఎడిటోరియల్లో ”శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ నుండి నేనెంతో ఆశించాను. కానీ, ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోవడం గొప్ప విషాదం” అంటూ డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ శ్రద్ధాంజలి ఘటించారు.
బ్రాహ్మణ సమాజంలోని పిడివాదులు, సనాతన వాదులు, కేసరి మరాఠా ట్రస్ట్‌ సభ్యులు మూకుమ్మడిగా పెట్టిన మానసిక హింస వల్ల, కోర్టు కేసుల వల్ల, ఏడేళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి వేసారి పోవడం వల్ల శ్రీధర్‌ తిలక్‌ ఆత్మహత్యకు పూనుకుని ఉంటారు. ఒక ఛాందసుడిగా తన తండ్రి దారిలో నడిచి ఉంటే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ప్రవాహానికి ఎదురీదడం ఎప్పుడైనా కష్టమైన పనే, ధైర్యమైన పనే, తన ప్రత్యర్థులతో వీలైనంత వరకు పోరాడారు కానీ. ఏదో ఒక బలహీన క్షణాన ఆత్మహత్య చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. అలా జరగకుండా ఉండాల్సింది. సమాజం అందించిన అన్ని అర్హ తలూ ఉండి, అగ్రవర్ణం వాడై ఉండి నిమ్న జాతుల గురించి, అంటరానితనం గురించి, అభ్యుదయ కాంక్షతో పని చేయడమే ఆయన ప్రాణం మీది కొచ్చింది.
బాల గంగాధర తిలక్‌ అంటరాని వాడిగా పుట్టి ఉంటే ”అంటరానితనం నిర్మూలనే నా జన్మహక్కు” అని అని ఉండేవారే మోనని అన్నారు అంబేద్కర్‌. ‘స్వరాజ్యం నా జన్మహక్క” అన్న బాల గంగాధర తిలక్‌ 1918లో మహారాష్ట్రలోని బెలగావ్‌ దగ్గర ‘అధేవ్‌’ అనే ఊళ్ళో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ నిమ్నకులాల వారిని ఎలా ఎగతాళి చేశారో చూడండి. ”నూనె తీసేవారు, కల్లు గీసేవారు, కుండలు చేసేవారు చట్ట సభల్లోకి వచ్చి నూనె తీస్తారా? కల్లు గీస్తారా? కుండలు చేస్తారా? అని శ్రామిక కులాలను అవమాన పరిచారు. బ్రాహ్మ ణులు చట్ట సభల్లోకి వచ్చి ఏం చేస్తారు? పూజా కార్యక్రమాలు, శ్రార్ధకర్మలు నిర్వహి స్తారా? అని ప్రశ్నించే వాతావరణం ఆనాడు లేదు. అందుకని ఆయనను ఎవరూ ప్రశ్నించలేక పోయ్యారు. ఒక వైపు స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూ, మరొక వైపు స్వదేశీయులను సోదర భావంతో చూడలేని కుత్సిత బుద్ది గల సంప్రదాయ ఛాందసవాది లోకమాన్య బాల గంగాధర తిలక్‌ అనే విషయం అందరూ గ్రహించాల్సి ఉంది. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర ఏపాటిదైనా, స్వదేశీయుల్ని విభజించి చూసే మనువాద భావజాలాన్ని ఆధునిక అభ్యుదయ వాదులందరూ ఖండిస్తారు. స్వయంగా ఆయన కుమారుడైన శ్రీధర్‌ పంత్‌ తిలకే సహించలేక పోయారు. వెనక్కి నడిచే తన తండ్రి ఆలోచనా విధానాన్ని త్వజించి, భావితరాలకు ముందుకు నడిపించే మార్గాల్ని ఎన్నుకున్నాడు.
మతం, దేవుడు వంటి వ్యక్తిగత విషయాల్ని రాజకీయాల్లోకి తెచ్చి. ఈ రోజు గణపతి విగ్రహాల్ని చెత్తకుండీల పక్కన పెట్టించి, ఐటమ్‌ సాంగ్స్‌కు డాన్సులు చేయిస్తున్న లోకమాన్యుడు ఈ తరానికి మాన్యుడేమీ కాదు. ఆయన కుమారుడు శ్రీధర్‌ తిలకే మాన్యుడు! కాలం పెట్టిన పరీక్షలో తండ్రి బాల గంగాధర తిలక్‌ అపజయుడయితే – కొడుకు శ్రీధర్‌ తిలకే విజయుడయ్యాడు ”లోకమాన్య” అనే బిరుదుకు అర్హులైన వారు ఎవరైనా ఉన్నా రంటే – అది శ్రీధర్‌ పంత్‌ (బల్వంత్‌) తిలకే” అని అన్నారు. డా.బి.ఆర్‌. అంబేద్కర్‌. నిజమే! ప్రజా వ్యతిరేక విధానాలున్న వారికి ఇచ్చే బిరుదులు అనర్థదాయకం.-
శ్రీధర్‌ తిలక్‌ బ్రాహ్మణ వ్యతిరేకోద్యమాన్ని నడుపుతూ, బాల్య వివాహాల్ని ఆపడంలో, వైధవ్యంలో మగ్గుతున్న మహిళల సంక్షే మం చూడడంలో విశేషంగా కృషి చేశారు. ఆ విషయాల్లో ప్రభో దాంక్‌ం థాకరే, కేశవరావు జేధే ఆయనకు సహకరించారు. మరాఠా పత్రికలకు శ్రీధర్‌ తిలక్‌ సామాజిక అంశాల మీద చాలా వ్యాసాలు రాశారు. అవి ‘మాజావ్యాసంగ్‌’ శీర్షికతో పుస్తకంగా వచ్చింది. శ్రీధర్‌ పంత్‌ (బల్వంత్‌) తిలక్‌ కు శ్రీకాంత్‌ శ్రీధర్‌ తిలక్‌, జయంత్‌ శ్రీధర్‌ తిలక్‌ అని ఇద్దరు కొడుకులు వారిలో జయంత్‌ (1921-2001) రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యసభ మెంబర్‌ గా, యం.ఎల్‌.సిగా కూడా ఉన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా పదహారేళ్ళ పాటు పనిచేశారు.
సంఘ సంస్కరణకు పూనుకున్నప్పుడు సమాజం తన రాతి గుండెతో స్పందిస్తుంది. దాని ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటా యంటే – మళ్ళీ ఎవరూ సంస్కరణ గురించి నోరెత్తడానికి కూడా వీల్లేనంతగా భయపెడతాయి. మనిషిని రాచి, రంపాన పెట్టి, హింసించే విషయంలో ప్రభుత్వాని కంటే సంఘానికే ఎక్కువ అవకాశాలు, ఎక్కువ మార్గాలూ ఉన్నాయి. అలాంటి మార్గాలు ఉపయోగించే ఈ సమాజం శ్రీధర్‌ తిలక్‌ను బలితీసుకుంది. అని అన్నారు అంబేద్కర్‌. తరతరాలుగా సమాజం మీద ఆధిపత్యం గల కులాలు తమ తోటి మానవుల మీద చేస్తున్న దౌర్జన్యాలను ఒక సామాజిక వైకల్యంగా చూడకుండా – ఒక గొప్ప సంప్ర దాయంగా పరిగణిస్తూ దాన్నే తమ వారసులకు అందిస్తున్నా రని- ఒక నిగూఢమైన, సున్నితమైన అంశాన్ని కూడా అంబేద్కర్‌ తన సంతాపంలో పొందుపరచారు.
ఈ అంశం నేటి సమకాలీన పరిస్థితులకు కూడా అన్వయిం చుకోవచ్చు. సనాతన ధర్మం – సంప్రదాయం – దేశభక్తి – హిం దుత్వ- అంటూ దేశ ప్రజల్ని విభజిస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వ చర్యల్ని వివేకవంతులు నిరసించాల్సి ఉంది. పనికొచ్చే మాట ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పినా, దాన్ని స్వీకరించి ఆచర ణలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. శ్రీధర్‌ పంత్‌ తిలక్‌ ను ఆదర్శంగా తీసుకుని, ఆధిపత్య కులాలలో ఉన్న విద్యావంతులు, మేధావులు – మనుషులందరూ సమానమే అన్న విషయం గ్రహించాలి! అదే విషయం ప్రచారం చేయాలి!! అంతే గానీ, అనవసరంగా మనోభావాలు దెబ్బతీసుకోగూడదు.
– సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌
(మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు