కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి

Projects built by KCR are collapsing– బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ
– డిసెంబర్‌ 9న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం: కోదాడ కార్నర్‌ మీటింగ్‌లో కర్నాటక ఉపముఖ్యమంత్రి డికె.శివకుమార్‌
– కేసీఆర్‌ కట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి
నవతెలంగాణ-కోదాడరూరల్‌
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో కట్టిన ప్రాజెక్టులన్నీ కుంగిపోతున్నాయని కర్నాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ లాంటిదని, డిసెంబర్‌ 9వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దీమా వ్యక్తం చేశారు. కోదాడలో కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 25 వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. ప్రజలు కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఇల్లు లేని వారికి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 100 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా రూ.5 లక్షలు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాలు కర్నాటకలో నాలుగు నెలల నుంచి అమలు అవుతున్నాయన్నారు. ఇక్కడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కర్నాటకకు వచ్చి తాము అమలు చేస్తున్న హామీలను చూడొచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వేరుపడినా రెండు రాష్ట్రాల డీఎన్‌ఏ ఒకటే అన్నారు. రెండు చోట్లా కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముజూర్‌నగర్‌, కోదాడ ప్రజలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి – పద్మావతి రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు, ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.