కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదు

– తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం ఎలా ?
– పునర్విభజన సరిగ్గా జరగలేదు : జలశక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) లేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సమ న్వయం ఎలా చేస్తారని కేంద్ర జలశక్తి శాఖ సలహా దారు శ్రీరాం వెదిరె అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగ్గా జరగకపోవడంతో సమస్యలు వస్తు న్నాయని అన్నారు. ఇప్పటివరకు కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించలేదనీ, పరస్పర విమర్శలతో ప్రయోజనం లేదని చెప్పారు. కృష్ణా నదిపై ప్రాజెక్టు లు, కేఆర్‌ఎంబీ విధివిధానాలపై ఆయన హైదరా బాద్‌లోని పీఐబీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలు రాష్ట్ర అధికారులు ఇవ్వలేదని చెప్పారు.
ఇప్పటి సర్కారు సైతం పంప లేదనీ, ఇప్పటికైనా జాతీయ డ్యామ్‌ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. రాష్ట్రం సమాచారం ఇస్తేనే ఎన్‌డీఎస్‌ఏ విచారణ చేయగలగుతుంది, మేడిగడ్డ నిర్మించేటప్పుడు జిలయోలాజికల్‌ సర్వే వారి సహాయం తీసుకుని ఉండాల్సిందనీ, సర్వే చేయ కుండానే ప్రాజెక్టు కట్టడం అతి పెద్ద తప్పని అన్నారు. థర్డ్‌ పార్టీ నాణ్యత తనిఖీలు చేయడం కూడా చాలా అవసరమనీ, ప్రాజెక్టు నిర్మాణం వివిధ స్థాయిల్లో కంప్లీషన్‌ రిపోర్టులు ఇవ్వాలని అన్నారు. మొత్తం ప్రాజెక్టుకు ఒకేసారి కంప్లీషన్‌ రిపోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్‌డిఎస్‌ఏ కమిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆమోదం తెలిపారని వివరించారు. వచ్చే వారం ఎన్‌డిఎస్‌ఏ కమిటీ రాష్ట్రానికి వస్తుందనీ, అడిగిన సమాచారం కమిటీకి ఇస్తే విచారణ సత్వరం పూర్తవుతుందన్నారు.
తెలంగాణకు సహకరించాలని నేను ఎంతోగాను ప్రయత్నిస్తున్నా, రాష్ట్రం నుంచి స్పష్టమైన సమాచారం రావట్లేదని గుర్తు చేశారు. సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్రం కూడా సాయం చేయలేదని అభిప్రాయపడ్డారు. ఆరు ప్రాజెక్టులను పూర్తిచేసుకోవాలని విభజన చట్టంలో చెప్పారని గుర్తు చేశారు. నీటి కేటాయింపులు మాత్రం చెప్పలేదనీ, నాలుగు ఏపీ, రెండు తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయింపుల్లేవని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల సమస్య పరిష్కారం కోసమే గత ఏడాది అక్టోబరులో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేశారన్నారు. విభజన చట్టం రూపొందిం చిందే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వమనీ, ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని విభజన చట్టం చెబుతున్న దన్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే దాన్ని తప్పు అంటున్నదని గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసమే కేంద్రం ప్రయత్నిస్తు న్నదని చెప్పారు. పదేండ్లుగా శ్రీశైలాన్ని ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహిస్తున్నా యని చెప్పారు. 299 టీఎంసీలకు గతంలోనే తెలంగాణ అంగీకరించిదన్నారు. కేఆర్‌ఎంబీని విలన్‌గా చూపించే ప్రయత్నం మంచిది కాదన్నారు. బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌ పరస్పరం విమర్శలతో కాలం గడుపు తున్నాయని వ్యాఖ్యానించారు. కేఆర్‌ఎంబీకి ఎవరూ ప్రాజెక్టులు ఇచ్చింది లేదనీ, ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించుకుంటే గొడవే ఉండదన్నారు. ప్రజల్లో అపోహాలు సృష్టించే ప్రయ త్నాలను పార్టీలు చేయకూడదని అభిప్రాయపడ్డారు. కేఆర్‌ఎంబీ లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమ న్వయం ఎలా చేస్తారని ప్రశ్నించారు.