నవతెలంగాణ-మంచిర్యాల
ఎన్నికల ముందు అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని, జీఓ 10ని రద్దు చేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్‌లను పెంచుతూ వీఆర్‌ఎస్ సౌకర్యం కల్పించి కొత్త జీఓ తేవాలని కోరుతూ సోమవారం మంచిర్యాలలో గల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఇంటి ముట్టడించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తెలంగాణ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన తెలిపారు. సంబంధిత అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలని, 24 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్స్, హెల్ఫర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేయాలని డింమాండ్ చేశారు. హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అంగన్‌వాడీ టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష ఆసరా పెన్షన్, 65 సంవత్సరాలలోపు రిటైరైన టీచర్స్, హెల్పర్స్కు వీఆర్‌ఎస్ వర్తింప జేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 2వ పీఆర్సీలో ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన 5 శాతం ఐఆర్‌ను వర్తింపజేస్తామని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ జి.ఓ ఇస్తామని, సమ్మెకాలపు వేతనాలు చెల్లిస్తామని, ప్రమాద బీమా 2 లక్షలు చెల్లిస్తామని, టిఎ, డిఎలు, మే నెల సెలవులు, ఆన్‌లైన్‌్ ఒకే యాప్ ఉండే విధంగా చూడాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కు నష్టం కల్గించే పాత జీఓ నెం. 10ని రద్దు చేయాలనీ అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజీత్‌కుమార్ యూనియన్(సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భానుమతి, రాజమణి, విరోనిక, సబితా, అనురాధ, రాజేశ్వరి, శారదా, సత్యవతి, భాగ్య, ప్రవీణ, పద్మావతి, సరిత, లక్ష్మి, మహేశ్వరీ, స్వాతి, లావణ్య పాల్గొన్నారు.