ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Navatelangana,Telangana,Telugu News, Telangana News,Adilabadనవతెలంగాణ-నస్పూర్‌
అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సోమవారం ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ శోభ మాట్లాడుతూ ఆశా వర్కర్స్‌ గత 19 సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా పని భారంతో కాలమెల్లదిస్తున్నారన్నారు. గత శాసనసభ ఎన్నికలకు ముందు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చాలేదని వాపోయారు. ఏ ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయడం లేదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఫిక్స్డ్‌ వేతనం రూ.18,000 నిర్ణయించి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత సౌకర్యలు కల్పించాలని, ఇన్సూరెన్స్‌ రూ.50 లక్షలు, పెన్షన్‌ రూ.10వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం రూ.5 లక్షలు, రిజిస్టర్‌ బుక్కులు, యూనిఫామ్స్‌, గతంలో పెరిగిన జీతాల ఏరియర్స్‌, లెప్రసీ, పోలియో టీకా, ఎలక్షన్‌ డ్యూటీ బిల్లులు, ఎగ్జామ్స్‌ సందర్బంగా పని చేసిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఆశాల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నష్టం కలిగించే పరీక్షను రద్దు చేయాలని, ఆశాల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పద్మ, విజయలక్ష్మి, సునీత, కవిత, సుజాత, అరుంధతి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.