బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌ కష్ణయ్య.. సీఎం రేవంత్‌ రెడ్డికి వినతి పత్రం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానలను వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్‌ కష్ణయ్య కోరారు. మంగళవారం బీసీ నాయకుల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కష్ణయ్య మాట్లాడుతూ. కులాల వారీగా జనాభా లెక్కలు తీసి పంచాయతీరాజ్‌ ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 20 నుంచి ఎన్నికల వాగ్దానం ప్రకారం 42 శాతం కు పెంచాలన్నారు. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్‌ 50% పెంచాలన్నారు. క్రిమిలేయర్‌ ను తొలగించాలని కోరారు. బీసీ బందు ప్రవేశపెట్టి 10 లక్షలు ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్‌ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్‌టి., ఎస్‌సి, మైనారిటీ విద్యార్ధులకు ఇస్తున్న మాదిరిగా బిసి,ఇబిసి విద్యార్ధులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశ విద్య స్టైఫండ్‌ స్కీమ్‌ క్రింద అర్హులందరికీ స్టై ఫండు ఇవ్వడానికి దీని బడ్జెట్‌ 60 కోట్ల నుంచి 300 కోట్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు.బీసీ గురుకుల పాఠశాలలకు పెద్ద ఎత్తున డిమాండ్‌ యున్నందున అదనంగా 119 బీసీ గురుకులాల మంజూరు చేయాలి అని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజకష్ణ, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.