ప్రచారం..చప్పగా..! 

– మైకులు లేవు, సమావేశాల ఉసేలేదు
– మండల కేంద్రాలకే పరిమితమైన అభ్యర్థులు
– పల్లెల్లో కనిపించని ఎన్నికల సందడి
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్నికలంటే ఓ పండుగ లెక్క నెలరోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు,ర్యాలీలు, సమావేశాల హోరు సాగుతోంది.మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఇదే దుందాం కనిపించింది.ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడ కనిపించలేదు.ప్రచార హోరు కనిపించకపోగా మైకులు కూడా అక్కడక్కడే మొగుతున్నాయి.ఇక ర్యాలీలు జాడేలేదు.పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్న.. పల్లెల్లో మాత్రం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండా పోయింది.పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా పోటీచేస్తున్న అభ్యర్థులు మాత్రం మండల కేంద్రాలకే పరిమితం అయ్యారు. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు,  ప్రజాప్రతినిధులు,ప్రధాన పార్టీల అనుచరులు మరి రాలేదనకుండా మేజర్ గ్రామాల్లో ప్రచారం చేసి వస్తున్నారు.
అప్పుడే మస్తుగుండే..
ఎంపీ ఎన్నికలంటున్నరూ మరి మందు,విందు.. లేదా అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది.శాసనసభ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో మందుబాబులందరికి ప్రచారం జరిగినన్ని రోజులు పండుగలా సాగింది.స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరి మద్యం సీసాలను అప్పగించి వెళ్లారు.ఇప్పుడేమో అంతా స్తబ్దుగా ఉంది.
అభ్యర్థులు రాలేదు..
పోలింగ్ ఇంకా కొద్దీ రోజులే మిగిలింది.మే13న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ప్రచారం ఈనెల 11 వరకు మాత్రమే చేయాల్సి ఉంది.ఇప్పటి వరకు పల్లెల్లోకి అభ్యరులే రాలేదు.మండల కేంద్రాలకే పరిమితం అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి ఆయా పార్టీల అగ్ర నాయకులు జిల్లా కేంద్రాలతోపాటు,నియోజకవర్గాలు,మండల కేంద్రాల్లో మాత్రమే  ప్రచారం పరిమితం చేస్తున్నారు.కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు,నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్న అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మూగబోయిందనే చర్చ పల్లెల్లో హోరెత్తుతుంది.