– మరికొందరు ఐపీఎస్‌లకూ పదోన్నతులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అదనపు డీజీ సందీప్ శాండిల్యకు డీజీపీగా పదోన్నతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈయనతో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులకు కూడా పదోన్నతులు ఇచ్చినట్టు సమాచారం. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శాండిల్య.. పోలీసు శాఖలో పలు కీలక పదవులను నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్‌గా, హైదరాబాద్ రేంజ్ డీఐజీగా రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా, రాష్ట్ర రైల్వే పోలీసు విభాగం అదనపు డీజీగా, ఈ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్‌గా ఆయన కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక పదార్థాల రవాణా, వినియోగాలను అరికట్టటానికి గానూ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అదనపు డీజీగా సందీప్ శాండిల్యను నియమించింది. చిత్తశుద్ధి, నిజాయితిపరుడు, ముక్కుసూటిగా వ్యవహరించే ఐపీఎస్ అధికారిగా పేరుపొందిన సందీప్ శాండిల్య.. వివాదరహితుడిగా పేరుపొందారు.
ఇదిలా ఉంటే, రాష్ట్ర పోలీసు ఫోర్స్ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు అదనపు డీజీగా పదోన్నతినిచ్చి లభించింది. అదనంగా ఈయనకు పోలీస్ వెల్ఫేర్, స్టోర్స్ ఇంచార్జ్‌గా కూడా నియమించారు. కాగా, డీఐజీలుగా ఉన్న రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీఐజీ సుమతి, నగర క్రైమ్స్ విభాగం జాయింట్ కమిషనర్ రంగనాథ్, డీఐజీ రమేశ్ నాయుడు, ఇంటెలిజెన్స్ డీఐజీ కార్తికేయ, సత్యనారాయణలకు ఐజీలుగా పదోన్నతిలిచ్చారు. ఎస్పీలు ప్రకాశ్‌రెడ్డి, జోయెల్ డేవిస్‌లకు డీఐజీలుగా పదోన్నతులు లభించాయి.