– సీఎమ్‌డీ రిజ్వీకి ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో గడచిన ఏడాదిన్నర కాలంగా పదోన్నతుల్ని నిలిపేశారనీ, వాటిని తక్షణం సమీక్షించాలని విద్యుత్ బీసీ, ఓసి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్జెన్కో సీఎమ్‌డీ రిజ్వీకి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా ఫీడర్ పోస్టుల్లో ఎంపికైన ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి ప్రకటించలేదనీ, దీనివల్ల పదోన్నతులు నిలిచిపోయాయని వారు సీఎమ్‌డీ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సంస్థల్లో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల ప్రకారం 2014 జూన్ 2 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ, ఓసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఫీడర్ పోస్టుల్లో నేరుగా నియమించబడిన జూనియర్ లైన్మెన్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, సబ్ ఇంజనీర్లు, జూనియర్ అకౌంట్స్ అధికారులు, జూనియర్ పర్సనల్ అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డ్, ఫైర్ మెన్లు, కెమిస్ట్ తదితర ఉద్యోగులకు సంబంధించి సీనియారిటీలను మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సీఎమ్డీని కలిసిన వారిలో జేఏసీ చైర్మెన్ కోడెపాక కుమారస్వామి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, వైస్ చైర్మెన్ ఆర్ సుధాకర్‌రెడ్డి, కోకన్వీనర్ సి భానుప్రకాష్, విజయకుమార్ తదితరులు ఉన్నారు.