విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతుల్ని సమీక్షించాలి

– సీఎమ్‌డీతో విద్యుత్‌ ఉద్యోగుల కుల సంఘాలు భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్‌ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించాలని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ కులసంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారంనాడిక్కడి విద్యుత్‌సౌధలో ఆయా సంఘాల ప్రతినిధులతో టీజీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ రోనాల్డ్‌ రోస్‌, ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎమ్‌డీలు వరుణ్‌రెడ్డి, ముషారఫ్‌ ఫరూఖీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సంస్థల్లో రెండేండ్లుగా పదోన్నతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆయా సంఘాల నేతలు చెప్పారు. 2014 జూన్‌ రెండవతేదీ తర్వాత ఇచ్చిన అన్ని పదోన్నతుల్ని సమీక్షించాలని సూచించారు. నష్టపోయిన రిజర్వేషన్‌, సీనియారిటీ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. సాధారణ పరిపాలన శాఖ, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, పోలీస్‌ శాఖల్లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గతంలోనే పదోన్నతులను సమీక్షించి, నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం కల్పించిన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ జోనల్‌ ద్వారా సెలెక్ట్‌ అయిన వారికి వర్తింపచేయాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కోరారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు ఉన్నందువల్ల చేయలేదనీ, 2022 డిసెంబర్‌లో సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు మూసివేసినందున విద్యుత్‌ సంస్థల్లో వెంటనే పదోన్నతులను సమీక్షించాలని ఓసీ, బీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. ఉద్యోగుల సీనియారిటీని మెరిట్‌ ప్రాతిపదికన నిర్ధారించాలనీ, విద్యుత్‌ సంస్థల్లోని సర్వీస్‌ రెగ్యులేషన్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, తెలంగాణ స్టేట్‌ అవార్డునెట్‌ సర్వీస్‌ రూల్స్‌ కూడా మెరిట్‌ ప్రాధిపతికనే సీనియార్టీని నిర్ధారించాలని సూచిస్తున్నాయని తెలిపారు. కొంతకాలంగా వివిధ క్యాడర్లలో సీనియార్టీలను నిర్ధారించని కారణంగా ఒక్క జూనియర్‌ లైన్‌మెన్‌ క్యాడర్‌లోనే దాదాపు 3,600 మందికి పదోన్నతులు రావాల్సి ఉందన్నారు. కొన్ని అంశాలపై ప్రభుత్వం నుంచి వివరణ రావల్సి ఉందనీ, అవి రాగానే ఎవరికీ అన్యాయం జరక్కుండా పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. సమావేశంలో ఓసీ, బీసీ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ కోడెపాక కుమారస్వామి, కన్వీనర్‌ ముత్యం వెంకన్న గౌడ్‌, కో చైర్మెన్‌ ఆర్‌ సుధాకర్‌రెడ్డి కో కన్వీనర్‌ సీ భానుప్రకాష్‌, సంపత్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మెన్‌ డీ శ్యాం మనోహర్‌, పీ నారాయణ నాయక్‌, కన్వీనర్‌ మాతంగి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.