ఈఓల పదోన్నతులు పారదర్శకంగా జరిగాయి..

Promotions of EOs were done transparently.నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈఓల పదోన్నతులు పారదర్శకంగా జరగలేదని ఓ పత్రిక లో వచ్చిన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ ల సంఘం, తెలంగాణ దేవాదాయ అర్చక ఉద్యోగుల జేఏసీలు తీవ్రంగా ఖండించాయి. గురువారం బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజీ ఈఓస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరేందర్, రాజేష్ కుమార్, అర్చక ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు కాండూరి రవీంద్రచారి, జేఏసీ కన్వినర్ పరశురామ్ రవీంద్రచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్ర చంద్రశేఖర శర్మలు మాట్లాడారు. దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి పదోన్నతుల విషయమై గురువారం ఓ ప్రముఖ వార్త పత్రికలో దేవాలయ ఉద్యోగులను ప్రైవేటు ఉద్యోగులు అని వ్రాయడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 150 మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులని 500 మంది ఆలయాల్లో పనిచేస్తున్నారు. ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు అనడం తమ మనోభావాలు దెబ్బతినేవిధంగా ఉన్నాయన్నారు. 262 జీఓ ప్రకారం కార్యనిర్వహణ అధికారులుగా పదోన్నతులు పొందడం చట్టం కల్పించిన హక్కు అన్నారు. చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారమే ఈఓలుగా పదోన్నతులు తీసుకోవడం జరుగుతుందన్నారు. తాము గ్రాంటీన్ ఏయిడ్ ద్వారా వేతనాలు తీసుకుంటున్నాము కనుకే తాము ప్రభుత్వ ఉద్యోగులమే అన్నారు. ఓ పత్రిక అవగాహన రహితంగా వార్తను రాయడం సరైనది కాదన్నారు. అర్హత ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వం నిస్వార్థంగా ఈఓలుగా పదోన్నతులు కల్పించిందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈఓల సంఘం నాయకులు ఎం.శ్రీనివాస్ రెడ్డి, అంజనారెడ్డిలతో పాటు జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.