పౌల్ట్రీ పరిశ్రమపై ఆస్తి పన్ను బకాయిలు రద్దు చేయాలి

– పౌల్ట్రీ పరిశ్రమ రైతులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-షాద్‌నగర్‌
పౌల్ట్రీ పరిశ్రమలపై ఆస్తి పన్ను బకాయిలను వెంటనే రద్దు చేయాలని షాద్‌ నగర్‌ ప్రాంత పౌల్ట్రీ పరిశ్రమ రైతులు మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. పౌల్ట్రీ రైతులు కలిసి మంత్రికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులు మాట్లాడుతూ గతంలో తెలంగాణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పౌల్ట్రీలపై ఆస్తి పన్ను వేసిన దాఖలాలు లేవని, కేవలం ఒక్క షాద్‌ నగర్‌ మున్సిపాలిటీలోనే పౌల్ట్రీలపై ప్రాపర్టీ టాక్స్‌ విధించారని మంత్రికి వివరించారు. ఈ బకాయిలను రద్దు చేయాలని గతంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ప్రత్యేకంగా కలుసుకోవడం జరిగిందని ఆయన కూడా తమ తరపున ప్రభుత్వానికి సమస్యను విన్నవించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ ఎమ్మెల్యే కోరిన విధంగా తమ సమస్యలను దృష్టిలో పెట్టుకుని పౌల్ట్రీ పరిశ్రమకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతంకొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం పౌల్ట్రీని ఒక యూనిట్‌గా చేసి వంద రూపాయలు మాత్రమే మెయింటెనెన్స్‌ కింద వసూళ్లు చేయాలని కొత్త చట్టం చెబుతుందని గుర్తు చేశారు. పాత బకాయిల విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ రైతులు కాపా రామారావు, మాకినేని వెంకటనారాయణ, నువ్వుల శ్రీనివాసరావు, అర్జున్‌ రెడ్డి, కాపా వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, బండారు సతీష్‌, వైకుంఠ శరత్‌, మధు, నంబూరి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.