24 గంటల్లో రూ.4.44 కోట్ల సొత్తు స్వాధీనం

Property of Rs.4.44 crore seized in 24 hours– ఈసీ మొత్తం స్వాధీనాల విలువ రూ.340 కోట్లు
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం, ఆభరణాలు, చీరలు, మత్తు పదార్ధాలు పట్టుబడుతున్నాయి. గడచిన 24 గంటల్లో (అక్టోబరు 24 నుంచి 25వ తేదీ ఉదయం వరకు) రూ. 2.72 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 2,916 లీటర్ల మద్యం, 160 కిలోల నల్లబెల్లం, 11 కిలోల ఆలం స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ రూ.96.89 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. రూ.37.58 లక్షలు విలువైన 30.73 కిలోల గంజాయి
స్వాధీనం చేసుకున్నారు. రూ.6.78 లక్షలు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.30.32 లక్షలు విలువైన ల్యాప్‌ట్యాప్‌లు, క్రీడా పరికరాలు, చీరలు, బియ్యం వగైరాలు స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడిన అక్టోబరు 9 నుంచి 25వ తేదీ వరకు స్వాధీనం చేసుకున్న రూ.119.44 కోట్ల నగదుతో సహాచ మొత్తం స్వాధీనాల విలువ రూ.340 కోట్లను దాటినట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.