ఐదు ఎంపీ సీట్లకు కాంగ్రెస్‌కు ప్రతిపాదన

ఐదు ఎంపీ సీట్లకు కాంగ్రెస్‌కు ప్రతిపాదన– ఇండియా కూటమిని బలహీన పరిచేందుకు బీజేపీ కుట్ర
– హామీలు అమలు చేయాలంటున్న రైతులు ఉగ్రవాదులా?: నారాయణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఐదు సీట్లకు కాంగ్రెస్‌కు ప్రతిపాదన పెట్టామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ కాంగ్రెస్‌ పార్టీకి విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని మగ్దూం భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులు అజీజ్‌పాష, పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, బాలనర్సింహా, బాల మల్లేశ్‌, హిమవంతరావుతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఐదు స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రతిపాదించామనీ, అందులో ఒకటైనా ఇవ్వాలని కోరారు. ఇండియా కూటమిని బీజేపీ నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నదని విమర్శిం చారు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులు ఉగ్రవాదులో, దేశ ద్రోహులో కాదని తెలిపారు. అన్నం పెట్టే రైతులపై దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన 30మందిని మోడీ పట్టుకురావాలని డిమాండ్‌ చేశారు. మోడీకి చేతనైతే స్విస్‌ బ్యాంక్‌లో దాచిన డబ్బును తీసుకురాగలడా?అని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏపీలో రేపో మాపో కాంగ్రెస్‌ నాయకులను కలుస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఉంటేనే అసెంబ్లీకి పోతావా? ప్రతిపక్ష నాయకుడిగా పోవా? అలాంటప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. అసెంబ్లీకి పోకుండా ఫామ్‌హౌజ్‌లో పడుకుంటూ పిరికిపందలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రానోడు ప్రభుత్వ సొమ్మును ఎందుకు తీసుకుంటున్నావని ప్రశ్నించారు. కూనంనేని మాట్లా డుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతున్నదన్నారు. కాళేశ్వరం వరప్రదాయని కాదనీ, అది రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంప దనంతా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఖర్చు చేసి వృథా చేశారన్నారు. దాని నిర్మాణంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధరణిపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల పోరా టానికి మద్దతుగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.