
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ఆదేశించారు.మంగళవారం ఆయన తన చాంబర్లో రానున్న వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు.వానకాలం ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు డిఆర్డిఓ, ఎఫ్సిఐ, వ్యవసాయ తదితర శాఖలు రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టే యంత్రాలు, అన్ని మౌలిక సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. వానకాలం ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర స్థాయిలో సైతం సమావేశం ఉంటుందని, ఆ సమావేశం అనంతరం ప్రభుత్వం నుండి వెలువడే ఆదేశాల మేరకు ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామం వారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గ్రామాల పేర్లతో సహా టాగింగ్ చేస్తూ రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.అనంతరం ఆయన మిల్లర్లతో కష్టం మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) పై సమీక్షించారు. 2023- 24 సంబంధించి సెప్టెంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటివరకు జిల్లాలో 83 శాతం పూర్తికాగా, ఇంకా 17 శాతం పెండింగ్లో ఉందని, ఇందుకు సంబంధించి ఇంకా సిఎంఆర్ చెల్లించాల్సిన రైస్ మిల్లర్లు త్వరితగతిన పెండింగ్ సిఎంఆర్ ను చెల్లించాలని ఆదేశించారు.రోజు వారీ టార్గెట్ నిర్దేశించుకొని సిఎంఆర్ పూర్తి చేయాలన్నారు.ఇంఫోర్సుమెంట్ సిబ్బంది రెగ్యులర్ గా మిల్లర్లతో సమన్వవయం చేసుకొని సిఎంఆర్ ను పర్యవేక్షించాలన్నారు.డిఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల డిఎం హరీష్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, రైస్ మిల్లర్లు,ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.