నవతెలంగాణ-తాండూర్
మధ్యాహ్నం భోజనం ప్రాజెక్టును హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు అప్పగించే ప్రతిపాదనను ప్రభుత్వం మానుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం కోరారు. మంగళవారం ఎంఈఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాల పెంపు, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మధ్యాహ్న భోజన కార్మికులు వంట బందు పెట్టి హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నామని తెలిపారదు. ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించే యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 54,201 మంది 25 వేల పాఠశాలల్లో, 24 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులు భోజనం పెడుతున్నారని వీరంతా పరోక్షంగా మధ్యాహ్న భోజన కార్మికులుగా ప్రభుత్వంపై ఆధారపడ్డారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులు గత 24 సంవత్సరాలుగా అనేక కష్ట, నష్టాలను ఓర్చి పనిచేస్తున్నారని, పనిచేసే వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఉన్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం పథక నిర్వహణను హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్‌కు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, ఇందారపు తార, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం పాల్గొన్నారు.