కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని కాపాడండి

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని నాయిని చెరువు సమీపంలో గల భూమిని కొంతమంది నాయకులు, ప్రజా ప్రతినిధులు కలిసి కబ్జా చేశారంటూ 10వ వార్డ్ కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి మల్లయ్య ఆరోపించారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి మల్లయ్య మాట్లాడుతూ.. నాయిని చెరువు శిఖం భూమైన 808/ బి,808/ ఈ లో గల దాదాపు 5 గుంటల భూమిని కొంతమంది ప్రజా ప్రతినిధులు అధికారులు కబ్జా చేసి, వాటిని ప్రజలకు విక్రయించడం జరుగుతుందని ఆరోపించారు. దీనివలన ప్రజలు తీవ్రంగా నష్టపోతారని , భూమి నాయిని చెరువుకు సంబంధించిన బఫర్ జోన్ లో ఉందని దీనిని అమ్మడం గాని కొనడం కానీ చేయకూడదని ఇటీవలే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు, జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ , తాసిల్దార్ కు వినతిపత్రం అందించడం జరిగిందని చెప్పారు. స్పందించిన కమిషనర్ అట్టి భూమిలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని, సబ్ రిజిస్టార్ కు సైతం పంపించడం జరిగిందని, వెంటనే అధికారులు స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకొని ఎవరికి విక్రయించకుండా చూడాలని కోరారు.