ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటి సభ్యుడు ఆశయ్య
నవతెలంగాణ-జైపూర్‌
ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సామాజిక సంఘాలు, వామపక్ష పార్టీలు, లౌకికవాదులు, మేధావులు కలిసి ప్రభుత్వ సంస్థలను కాపాడుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ళ ఆశయ్య అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై సమావేశంలో చర్చించుకున్న నాయకులు కర్తవ్యాలపై దృష్టి సారించారు. ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల బిల్లుల చెల్లింపు, ఇండ్ల స్థలాలకు పట్టాలు, రూ.5 లక్షల ఇవ్వడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. శ్రావణపల్లి బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వడం, ప్రయివేటీకరణ ఆపివేడం, కార్మికులు స్కీమ్‌ వర్కర్ల సమస్యల పరిష్కారంలో పార్టీ పరంగా కృషి చేయాలని సమావేశంలో చర్చించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యులు అశోక్‌, దాసరి రాజేశ్వరి, జిల్లా కమిటి సభ్యులు బోడంకి చందు, దుంపల రంజిత్‌ కుమార్‌, గోమాస అశోక్‌, దాగం రాజారాం పాల్గొన్నారు.