– 20 ఏండ్లలో రూ. 5వేల కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం
– బోర్డును ఏర్పాటు చేసి జ్యుడీషియల్ అధికారాలు కల్పించాలి : 74 భూదాన దినోత్సవ సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో భూదాన భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని అని పలువురు వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత సర్వసేవా సంఫ్‌ు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో 74వ భూదాన్ దినోత్సవాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జాతీయ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి మాట్లాడుతూ 1951లో అచార్య వినోభా బావే పోచంపల్లికి వచ్చినప్పుడు వెదిరె రాంచంద్రరెడ్డితో ప్రారంభమైన భూదానోద్యంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షల ఎకరాల భూములను పేదలకు పంచేందుకు స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. అయితే 70 ఏండ్లలో ఇప్పటి వరకు కేవలం 95 వేల ఎకరాలు మాత్రమే పంచారనీ, మిగిలిన లక్షా 5 వేల ఎకరాల్లో 5వేల కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూదాన ట్రస్ట్ సిపారసు వాటిని మేరకు పంచాలనే సర్కార్ నిర్ణయాన్ని కాదని కొంతమంది తప్పుడు బోర్డును సృష్టించి ఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు, వారిపై తాము చేసిన ఫిర్యాదు మేరకు చేపట్టిన విచారణ అతీగతీ లేదని విమర్శించారు. రాజకీయనాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు, రియల్టర్లు భూదాన భూములను ఆక్రమించుకొన్నారని ఆరోపించారు. వెంటనే కొత్తగా భూదాన బోర్డును ఏర్పాటు చేసి జ్యూడిషియల్ అధికారాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ అధ్యక్షులు వెదిరె అరవింద్ రెడ్డి మాట్లాడుతూ భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన భూములను అర్హులైన పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమ ప్రక్రియను సంపూర్ణం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. భూమిలేని నిరుపేదలకు భూములు పంచాలనే నాటి భూదానయోధుల లక్ష్యం నేటికీ నెరవేరలేదని వాపోయారు. గత ప్రభుత్వం భూదాన భూముల పంపిణీ గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ప్రత్యేక చొరవ తీసుకుని పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ట్రస్టీ తోలుపునురి కృష్ణ గౌడ్, తెలంగాణ సాయుధపోరాట యోధులు, భూదాన దాతల కుటుంబ సభ్యులు డాక్టర్ ప్రబోద్ చంద్రా రెడ్డి, సురవరం కృష్ణవర్థన్ రెడ్డి, సాగర్ రెడ్డి, మల్లు కరుణ, బీంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆరుట్ల సుశీలా దేవి, రావి ప్రతిభ, మమత, సర్వసేవా సంఫ్‌ు రాష్ట్ర నాయకులు గరిగంటి రమేష్, చందూ పటేల్, దిడ్డి రాంబాబు, దిలీప్ నేత, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.