నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్భూముల్ని స్వాధీనం చేసుకోవాలని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 20 ఏండ్లుగా తాను ఇదే అంశంపై మొత్తుకుంటున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదని చెప్పారు. బుధవారం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించిందనీ, అది ఎటుపోయిందో అర్థంకావట్లేదన్నారు. రంజాన్ మాసం దగ్గరకు వస్తున్నా, మశీదులు, మదర్సాలు, ఛిల్లాలు, దర్గాల్లో సౌకర్యాల కల్పన ఇంకా ప్రారంభంకాలేదన్నారు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేసి, ఏర్పాట్లు చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు వారు అంగీకరించట్లేదనీ, దీనివల్ల చదువు పూర్తయినా ఉద్యోగాలు, ఉన్నత చదువులకు వెళ్లలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వివరించారు. సర్టిఫికెట్లు నిలిపివేయవద్దని ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కళాశాలల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలనీ, కులగణన త్వరగా చేపట్టి, జనాభా ప్రాతిపదికగా ఆయా వర్గాలకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరపాలని విజ్ఞప్తి చేశారు. గతంలోకంటే భిన్నంగా దాదాపు 45 నిముషాలసేపు ఆయన పలు సమస్యలపై శాసనసభలో మాట్లాడటం గమనార్హం. ఇదే అంశంపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా ప్రజల్ని మరోసారి మోసం చేసే చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు అర్థంతరంగా సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాష్‌రెడ్డి…వాళ్లను రమ్మని విజ్ఞప్తి చేయగలమే కానీ, తీసుకురాలేం కదా! అని అన్నారు.