– బీజేపీది మతాల మధ్య చిచ్చురేపే కుట్ర
– గత ఎన్నికల వాగ్దానాల మాటేమిటి?: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ -నర్సంపేట
గత పార్లమెంటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. ప్రజల్లో మతాల పేర చిచ్చురేపుతున్న మతోన్మాద బీజేపీని ఓడించి వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) హన్మకొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వాసవి కళ్యాణ మండపంలో కార్యదర్శి హన్మకొండ శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజల అకౌ ంట్లో జమ చేస్తామన్న బీజేపీ వాగ్దానం అమలుచేయలేదని విమర్శించా రు. అలాగే, రూ.20 కోట్ల ఉద్యోగాలు, రైతుల పంటకు మద్దతు ధర తదితర హామీలను అమలుపరచకపోగా.. ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారని, వాటికి వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు చేసిన పోరాటంలో సుమారు 750 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించి బీజేపీ యాజమాన్యాలకు కొమ్ముకాసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నాలు చేసి ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కుట్రలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పరిపాలనను ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయించి అక్రమంగా కేసులు బనాయించి జైల్లోకి నెట్టేస్తుందన్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలుగా ఉండాల్సిన లౌకికతత్వం, ఫెడరలిజంపై విపరీతంగా దాడులు చేస్తుందన్నారు. ఈసారి మళ్లీ అధికారం ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, రైల్వేలు, నౌకాశ్రయాలు, విమానయానాలు, బ్యాంకింగ్ రంగం ఒక్కటేమిటి అన్ని రంగాలు.. ప్రయివేటుపరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాటాల వల్ల రూపొందిన జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో కోతలు విధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బీజేపీకి బుద్ధి చెప్పాలని, ప్రజలందరూ వామపక్ష, లౌకిక శక్తులను గెలిపించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ.. కుల, మతాల పేరిట రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ మనువాదాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు, కొరబోయిన కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు నమిండ్ల స్వామి, అనంతగిరి రవి, పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకష్ణ, కందికొండ రాజు, ఎండీ ఫరిదా, రుద్రారపు లక్ష్మి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.