మిషన్‌ శక్తితో మహిళలు, యువతులకు రక్షణ

మిషన్‌ శక్తితో మహిళలు, యువతులకు రక్షణ– జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జీ యువరాజ
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
మహిళలు, యువతులు, బాలికల రక్షణ, అభివృద్ధికి జిల్లా శిశు, మహిళ సంక్షేమ శాఖ-మహిళ సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో మిషన్‌ శక్తి 100 రోజుల ప్రత్యేక సంయుక్త అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జీ యువరాజ అన్నారు. శనివారం ఆసిఫాబాద్‌ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారదలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జీ మాట్లాడుతూ మిషన్‌ శక్తి కార్యక్రమంలో భాగంగా కెరీర్‌ గైడెన్స్‌, సైబర్‌ క్రైమ్‌, మాదకద్రవ్యాల నిర్మూలన, సోషల్‌ మీడియా నుండి వచ్చే సమస్యలు, బాల్య వివాహాల నియంత్రణ ఇతర మహిళ సంక్షేమ అంశాలను వివరించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌ నంబర్లు 1098, 181, 100, 1930, 14446లలో సంప్రదించవచ్చని, బాల బాలికల రక్షణ, శ్రేయస్సు దిశగా ప్రజలందరూ కలిసి కృషి చేయాలన్నారు. బాలబాలికలందరికి సమాన హక్కులు ఉంటాయని, ప్రతి ఒక్కరూ చట్టాలు తెలుసుకోవాలని సూచించారు. మహిళలు, బాలికల పట్ల గౌరవభావం కలిగి ఉండాలన్నారు. తప్పు చేసిన వారికి చట్టం శిక్ష విధిస్తుందని, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, మన ఆలోచన విధానంతో సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని తెలిపారు. మొబైల్‌ వాడకాన్ని తగ్గించి చదువు, కెరీర్‌ మీద దృష్టి సారిస్తూఉన్నత స్థానాలలో నిలిచి ఊరికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీసీపీఓ మహేష్‌, జయరాజ్‌, మమత, రాణి, సాగర్‌, సీఏ మమత, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.