ఎంపీల సస్పెన్షన్‌పై నిరసన

Protest against suspension of MPs– వామపక్షాలు, కాంగ్రెస్‌, ఇతర పార్టీల ర్యాలీలు
–  కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ- విలేకరులు
ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారని పార్లమెంట్‌ లోపల, బయట ప్రశ్నించిన వారి గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారని వామపక్షం, కాంగ్రెస్‌, ఇతర రాజకీయ పార్టీల నాయకులు విమర్శించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 146 మంది విపక్ష ఎంపీలను పార్లమెంట్‌ నుంచి సస్పెండ్‌ చేసి ప్రజావ్యతిరేక చట్టాలను ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ర్యాలీలు తీసి దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఖమ్మం అంబేద్కర్‌ సెంటర్లో నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అటూ సీపీఐ ఆధ్వర్యంలోనూ పార్టీ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దేందుకు దుష్ట విధానాలు ముందుకు తీసుకొస్తుందని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాస్‌ సెంటర్‌లో నిరసన తెలిపారు. ర్యాలీ తీశారు. చిట్యాలలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా గుండాల మండలంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ వద్ద సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్‌, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, సీపీఐఎంఎల్‌ ప్రజాపంథా, తెలంగాణ జనసమితి, దళితమహాసభ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీ సభ్యుల సస్పెన్షన్‌ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మిర్యాలగూడలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరై కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ ధోరణిని ఎండగట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ధర్నా చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐల్‌ చౌరస్తా వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నేతలకు ప్రజాస్వామ్య విలువలు తెలియజేసి జ్ఞానోదయం కల్పించాలని కోరుతూ ఘట్కేసర్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. షాపూర్‌నగర్‌ రైతు బజార్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో మేడ్చల్‌- మల్కాజి గిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌ గౌతమ్‌కు వినతిపత్రం అందజేశారు.