ఉరి తాళ్లు వేసుకుని జీపీల నిరసన

– కొనసాగుతున్న పంచాయతీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ- విలేకరులు
నల్లగొండ జిల్లా తిప్పర్తిలో జీపీ కార్మికులు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. మునుగోడులో ‘బతుకమ్మ మా బతుకులు మార్చమ్మ’ అంటూ బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. కేతెపల్లిలో పెరిగిన ధరలకు ఈ వేతనం ఏమిటికీ సరిపోదు, మేము గడ్డి తిని బతకాల్సిందే అని వరిగడ్డి నోట్లో పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. చండూరులో కండ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. చిట్యాలలో గుండు చేయించుకొని నిరసన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో జీపీ కార్మికులు ఎంపీడీవో ఆఫీసు నుంచి ప్రదర్శనగా వచ్చి బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూర్‌ఎస్‌ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జీపీ కార్మికుల సమ్మెకు సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాలు సంఘీభావం తెలిపాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జీపీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కడ్తాల్‌లో చేపట్టిన సమ్మెకు రైతుసంఘం, గొర్ల మేకల పెంపకందారుల సంఘాల జిల్లా నాయకులు కాన్గుల వెంకటయ్య, జల్లెల్ల పెంటయ్య జీపీ కార్మికులకు మద్దతు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా తాండూర్‌లోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కార్మికులు పడుకుని నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలో ముంపు గ్రామాల్లో పర్యటనకు వచ్చిన ఎంపీ నామా నాగేశ్వరరావుకు జీపీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. కల్లూరులో మానవహారం నిర్వహించారు. ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు వచ్చిన కార్మికులతో మాట్లాడి నిరసన విరమింపజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తూ.. పారిశుధ్య పనులు చేశారు. అశ్వారావుపేటలోనూ పారిశుధ్య పనులు చేసి నిరసన తెలిపారు. నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం కేంద్రంలో వాంటావార్పు చేసి, భైంసా అంతర్రాష్ట్ర రహదారిపై కూర్చోని బోజనం చేశారు. దస్తురాబాద్‌ మండల కేంద్రంలో కార్మికులు వాంటావార్పు చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన తెలిపారు.