– ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీత
– యువకుడిపై బీఆర్‌ఎస్ కార్యకర్త దాడి
– పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుకు నిరసన సెగ ఎదురైంది. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని.. సంక్షేమ పథకాలు అన్హరులకు ఇస్తున్నారని ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే భాస్కరరావును గ్రామస్తులు నిలదీశారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని రాయిని పాలెం, ఆలగడప గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆలగడప గ్రామానికి వచ్చిన ప్రగతి యాత్రను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని, సంక్షేమ పథకాలు సొంత పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇంతవరకు ఇవ్వలేదని, సంక్షేమ పథకాలు ఎవరికిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వీటిపై ఎమ్మెల్యే భాస్కరరావు సమాధానం చెప్పాలని యువకులు గట్టిగా పట్టుబట్టడంతో గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు సత్యపాల్ ప్రశ్నించిన యువకులను అడ్డుకున్నారు. ప్రచారాన్ని అడ్డుకుంటే ఊరుకునేలేదని హెచ్చరించారు. పైగా ప్రశ్నించిన యువకుడిపై దాడికి దిగారు. గ్రామస్తులు బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని యువకులను అక్కడి నుంచి పంపించి వేయడంతో గొడవ సద్దుమణిగింది. ఎమ్మెల్యే భాస్కరరావు గతంలో అనేక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో గ్రామస్తులపై నోరు పారేసుకున్న సంఘటనలున్నాయి. ఆయా సామాజిక తరగతులను కించపరిచే విధంగా మాట్లాడారు. ఇటీవల వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో సంక్షేమ పథకాలపై ప్రశ్నించినందుకు ఆమెను దుర్భాషలాడినట్టు సమాచారం. ఎమ్మెల్యే భాస్కర్ రావు తీరు పట్ల నిరసన వ్యక్తం కూడా చేశారు. భాస్కర్ రావు వ్యవహార శైలి పట్ల నియోజవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.