
– వ్యవసాయ,ఉద్యాన విశ్వవిద్యాలయాల భూముల జోలికొస్తే ఊరుకోం…
– నూతన హైకోర్టు నిర్మాణానికి ఇతర ప్రభుత్వ భూములు కేటాయించాలి…..
– ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం
– ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం లోని వ్యవసాయ కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ కళాశాల విద్యార్థులతో జీవో నెంబర్ 55 ను తక్షణమే రద్దు చేయాలని, గేటు వరకు ర్యాలీ నిర్వహించి బయట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బుర్ర వీరభద్రం మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని వ్యవసాయ, హర్టికల్చర్ యూనివర్సిటీలలో 100 ఎకరాల భూమిని నూతన హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 55 ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ,హర్టికల్చర్ యూనివర్సిటీల లోని భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడం ద్వారా యూనివర్సిటీలో జీవ వైవిద్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, అక్కడి అనేక అంతరించే పక్షి జాతులు, జంతు జాతులు, మొక్కలు ఉన్నాయనీ, ఆయా జీవజాలం మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం కానుందని అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీలో పశుసంవర్ధక, ఉద్యాన, వ్యవసాయ,పట్టు పరిశ్రమ రంగాలలో పరిశోధనలు జరుగుతున్నాయని, బయోడైవర్సిటీ ఫ్లాంట్ కొనసాగుతుందని, అటువంటి భూమిని ఇతర కట్టడాలకు కేటాయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. వ్యవసాయ కళాశాల భూములను ప్రభుత్వం లాక్కుంటే భవిష్యత్తులో వ్యవసాయ, హార్టికల్చర్ విద్యార్థులు పరిశోధనలు ఎక్కడ చేయాలని ప్రశ్నించారు.హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయని వాటిని లాక్కొని హైకోర్టు నిర్మాణం చేపట్టాలని కోరారు.హైకోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ భూములు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద నాగ కృష్ణ,జిల్లా నాయకులు సి.హెచ్ రామ్ చరణ్, అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.